లాక్‌డౌన్ కొనసాగింపుపై ప్రధాని స్పష్టత రేపు  

మంగళవారం ఉదయం పది గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని కార్యాలయం ట్వీట్ ప్రకారం మోదీ మంగళవారం ఉదయం పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఆయన స్పష్టత ఇస్తారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో పాటు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరో ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తారని కూడా భావిస్తున్నారు. 

21 రోజుల లాక్‌డౌన్ మంగళవారం ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనేది మోదీ తన ప్రసంగంలో వెల్లడిస్తారు. ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ నెలాఖరు వరకూ కొనసాగిస్తామని ప్రకటించాయి. జూన్ రెండోవారం వరకూ విద్యాసంస్థలు మూసివేస్తామని తెలిపాయి.  

ఇలా ఉండగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అధికార కార్యకలాపాలకు దూరమైన అందరు కేంద్ర మంత్రులు, జాయింట్ సెక్రటరీలు, ఉన్నతస్థాయి అధికారులు సోమవారం నుంచి తిరిగి విధుల్లో చేరారు. 

కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, డీవీ సదానంద గౌడ, అర్జున్ ముండా, కిరణ్ రిజిజు తమ విధుల్లో చేరి.. ఉన్నతస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు.  అయితే కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు. 

ఇతర సిబ్బంది రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కార్యాలయాలకు రాలేకపోయారని.. మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘‘ఉన్నతాధికారులు, కొందరు సిబ్బంది మాత్రమే ఈరోజు నుంచి విధుల్లో చేరుతున్నారు. కోవిడ్-19 నిబంధనలను మేం కచ్చింతగా పాటిస్తాము’’ అని ఆయన తెలిపారు. 

విధుల్లో చేరిన మంత్రులు కార్యాలయాల్లోకి వెళ్లే ముందు వాళ్లకి టెంపరేచర్ గన్లతో పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత శానిటైజేషన్ చేసి కార్యాలయాల్లోకి అనుమతించారు.