దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని గడ్డుపరిస్థితులు

దేశంలో ప్రస్తుతం అత్యంత అసాధారణమైన పరిస్థితి నెలకొందనీ.. ఇంతకు ముందెన్నడూ లేని గడ్డుపరిస్థితులను చూస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టాల్సి ఉందని సూచించారు. 

కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీనివల్ల  ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందనీ.. ఇప్పటి వరకు సంభవించిన అన్ని ఆర్ధిక సంక్షోభాల కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. 

‘‘కొవిడ్-19 మహమ్మారి ఓ అదృశ్య హంతకి. మహా వినాశనం సృష్టించక ముందే దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇది విలువైన మానవ ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు స్థూల ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ కొడుతుంద" అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగాలకు జీవనాడి వంటి ద్రవ్య వ్యవస్థను సజావుగా కొనసాగించండం అత్యంత కీలకమని హితవు చెప్పారు. 

గతనెల 24 నుంచి 27 వరకు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం వివరాలను విడుదల చేస్తూ ఆయన ఈ వాఖ్యలు చేశారు. కాగా కరోనా కల్లోలం నేపథ్యంలో గత నెలలో కీలక వడ్డీ రేట్లను సవరిస్తూ ఆర్బీఐ అత్యవసర నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.