చైనాలోని సంస్థలను ఆకర్షించే సమయం ఇదే 

కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా నుంచి తమ తయారీ కేంద్రాలను మార్చాలని చూస్తున్న సంస్థలను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయమని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిపెట్టాలని కోరింది. 

భూ సేకరణ చట్టంలో మార్పులు తేవాలని, నెల రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, రెండు నెలల్లో బ్యాంక్‌ రుణాలను మంజూరు చేయాలని ఎఫ్‌ఐఈవో అధ్యక్షుడు ఎస్‌ సరఫ్‌ ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. భూములు అందుబాటులో ఉంటే అన్ని రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి మండలిలు నెల రోజుల్లో కేటాయించాలని సూచించారు. 

నియోజకవర్గ కేంద్రాల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ భూముల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు షరతులతో కూడిన అనుమతుల్ని ఇవ్వాలని ఆ లేఖలో సరఫ్‌ సూచించారు. మరో అటవీ భూమిలో పరిశ్రమ యాజమాన్యాలతో మొక్కలు నాటించాలని, దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధి లభిస్తుందని సూచించారు.

 ప్రస్తుతం భారీ సంస్థలే భారత్‌కు వస్తున్నాయని, క్షేత్రస్థాయి సమస్యలను తీర్చితే చిన్న, మధ్యతరహా సంస్థలూ దేశంలోకి వస్తాయని చెప్పారు. 

ఇలా ఉండగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో పరిశ్రమలుసహా అనేక రంగాలు పునర్నిర్మాణం కావాల్సిన అవసరం ఉందని ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సూచించారు.

ఫిక్కీ, ఈశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతూ విదేశీ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. అలాగే వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు పెరుగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.