దక్షిణాసియా దేశాలన్నింటిలో వ్యతిరేకాత్మక వృద్ధి  

ప్రపంచాన్ని పీడిస్తున్న నోవల్ కరోనా వైరస్ మహమ్మారి దక్షిణాసియాను తీవ్రంగా దెబ్బతీయబోతోందని ప్రపంచ బ్యాంకు ఆదివారం హెచ్చరించింది. ఈ ప్రాంతంలో పేదరిక నిర్మూలనలో సాధించిన విజయాలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ వ్యతిరేకాత్మక వృద్ధి రేటును చూస్తాయని జోస్యం చెప్పింది. 

ప్రజలను, మరీ ముఖ్యంగా నిరుపేదలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సన్నాహాలు చేయాలని కూడా సూచించింది. రెండేళ్లకోసారి విడుదల చేసే ప్రాంతీయ నివేదికలో ఈ వివరాలను తెలిపింది.

తాజాగా విడుదలైన ‘సౌత్ ఆసియా ఎకనమిక్ ఫోకస్’ నివేదిక ప్రకారం దక్షిణాసియాలో ఉన్న 8 దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయని, వ్యాపారాలు కుప్పకూలిపోయాయని, ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉందని పేర్కొంది.  

కోవిడ్-19 మహమ్మారి ఈ ప్రాంతాన్ని గట్టి దెబ్బ తీయబోతోందని, పేదరిక నిర్మూలనలో సాధించిన విజయాలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణాసియా ప్రాంతీయ వృద్ధి 2020లో 6.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆరు నెలల క్రితం అంచనా వేసింది. తాజా అనిశ్చితి నేపథ్యంలో ఈ రేటు 1.8 శాతం నుంచి 2.8 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా ప్రాంతం) హాన్స్ టిమ్మర్ మాట్లాడుతూ మాల్దీవులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక నష్టపోతాయన్నారు. ఇతర దేశాల్లో స్వల్పకాలిక మాంద్యం రావచ్చునని, అయితే ఆర్థిక సంవత్సం వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. 

భారత దేశం బేస్‌లైన్ గ్రోత్ 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్యలో ఉండవచ్చునని చెప్పారు. దక్షిణాసియాలోని ప్రభుత్వాల ప్రాధాన్యం తప్పనిసరిగా కోవిడ్-19ను అదుపు చేయడం, ప్రజలను కాపాడుకోవడమేనని ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు (దక్షిణాసియా ప్రాంతం) హార్ట్‌విగ్ షాఫర్ తెలిపారు.