పేదలకు జూన్ దాకా 8 సిలిండర్లు

కరోనా బాధిత పేదలకు సహాయ ప్యాకేజీలో భాగంగా కేంద్రం 5 కిలోల వంటగ్యాసు సిలిండర్లను జూన్ వరకూ అందిస్తుంది. 5 కేజీల సిలిండర్లను  అప్పటివరకూ మొత్తం మీద ఎనిమిది వరకూ పంపిణీ చేస్తారని చమురు మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు  తెలిపారు. ఇక 14.2 కెజిల సిలిండర్లను వాడే పేదలలకు ఈ ప్యాకేజీ పరిధిలో మూడు సిలిండర్లు అందచేస్తారు.

కరోనాతో పూర్తి స్థాయిలో దెబ్బతిన్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్రం రూ 1.7 లక్షల కోట్ల కోవిడ్ 19 ప్యాకేజీని గత నెల 26వ తేదీన ప్రకటించింది. అప్పట్లో ఈ ప్యాకేజీ పరిధిలో కేవలం ఉచిత గ్యాసు సిలిండర్లను దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది నిరుపేదలకు అందిస్తామని ప్రతిపాదించారు. అయితే వేర్వేరు పరిణామాల సిలిండర్లు వాడే పేదింటి వారు ఉండటంతో అసలు ఎన్ని సిలిండర్లు అందుతాయనే అయోమయం నెలకొంది.

పైగా లాక్‌డౌన్ పెరుగుతూ ఉండటం, పేదలు పలు రకాలుగా ఉపాధి కోల్పొవడంతో ఇప్పుడు చమురు మంత్రిత్వశాఖ దీనిపై వివరణ ఇచ్చుకుంది. ప్రధాన మంత్రి గరీబు కళ్యాణ యోజన పరిధిలో ఈ పేదలకు ఎప్రిల్, మే, జూన్ వరకూ అందే సిలిండర్ల సంఖ్యను ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దేశంలో లాక్‌డౌన్ నాటి నుంచి దేశవ్యాప్తంగా రోజూ 50 నుంచి 60 లక్షల సిలిండర్లను ప్రతిరోజూ దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అత్యధిక ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో గ్యాసు వినియోగం పెరిగింది. ఎల్‌పిజి వినియోగదారులందరికీ సరైన రీతిలో బుకింగ్‌లకు అనుగుణంగా గ్యాసు సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

డెలివరీ బాయ్స్, సరఫరా క్రమంలో ఉండే వారంతా కరోనా సమయంలోనూ విరామం తెలియక గ్యాసు సరఫరాకు కృషి చేస్తున్నారు. ఎప్రిల్ నెలలో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా చూస్తే 1.26 కోట్ల సిలిండర్లకు బుకింగ్ జరిగింది. ఇందులో ప్రధాన మంత్రి ఉజ్జల యోజన పరిధిలో (పిఎంయువై) ఇప్పటికే దాదాపు 85 లక్షల సిలిండర్లు వినియోగదార్లకు పంపిణీ అయ్యాయి. 

సబ్సిడీని అందుకునే వంటగ్యాసు వాడకందార్ల సంఖ్య దేశవ్యాప్తంగా చూస్తే 27.87 కోట్ల వరకూ ఉంది. వీరందరికి ప్రస్తుత తరుణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వంటగ్యాసు సిలిండర్లు అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. చమురు సంస్థల నుంచి తగు కోటా అందేలా జాగ్రత్తలు చేపట్టింది.