దిగుమతి అవుతున్న కరోనాతో చైనా సతమతం  

అన్ని దేశాలకు కరోనా వైరస్ ను వ్యాపింప చేసి అగ్గిరాజేసిన చైనా ఇప్పుడు సొంత దేశంలో వైరస్ ను కట్టడి చేసినా విదేశాల నుండి దిగుమతి అవుతున్న కేసులతో సతమతమవుతున్నది. ఆదివారం చైనాలో నమోదైన కరోనా కేసుల్లో సగం వరకు రష్యా నుంచి వచ్చిన చైనీయులవే కావడం గమనార్హం. 

రష్యా సరిహద్దుల్లోని హైలోంగ్‌ జియాంగ్ రాష్ట్రంలోని హార్బిన్ నగరానికి కరోనా తాకిడి అంతకంతకు ఎక్కువవుతున్నది. రకరకాల కారణాల వల్ల రష్యాలో నివసించే చైనీయులు పెద్దసంఖ్యలో ఇప్పుడు స్వదేశం తిరిగి వస్తున్నారు. అయితే వారితోపాటుగా కరోనా కూడా దిగుమతి అవుతున్నది. 

షాంఘైలో శనివారం నమోదైన 52 కేసుల్లో 51 కేసులు బయటి నుంచి వచ్చిన చైనీయులవేనని ఆ నగర మునిసిపల్ కమిషన్ వెల్లడించింది. నగరంలో దిగిన తర్వాతనే వారికి కరోనా ఉన్నట్టు గుర్తించామని అంటున్నారు. విమానం వివరాలుగానీ, ఇతర వివరాలు గానీ తెలియరాలేదు. 

ప్రస్తుతం వారానికి ఒక విమానాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. రష్యా నుంచి భూమార్గం ద్వారా కూడా రాకపోకలు జరుగుతాయి.