మరోసారి ప్రధాని మోడీ అంటున్న సి-వోటర్ సర్వే

2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి రానుందని తేలింది. అయితే ఎన్డియే వోట్లు, సీట్లు తగ్గుతాయని, యుపియే సీట్లు 100ను దాటవచ్చని తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై రిపబ్లిక్‌ టీవీ, సీ–వోటర్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 276 చోట్ల గెలుపొందనుందని వెల్లడైంది. అటు కాంగ్రెస్‌ కాస్త పుంజుకున్నప్పటికీ యూపీఏ 112 స్థానాలకే పరిమితం కానుందని సర్వే పేర్కొంది.

అయితే ప్రాంతీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 155 స్థానాల్లో విజయం సాధించి కీలకభూమిక నిర్వహించవచ్చని సర్వేలో వెల్లడైంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో అన్ని సీట్లను బిజెపి గెల్చుకోబోతున్నది.

కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో మహాఘట్‌బంధన్‌ పేరుతో ఎస్పీ, బీఎస్పీ ఏకమైతే బీజేపీ సీట్లకు గండికొట్టడం ఖాయంగా కనబడుతోంది. ఈసారి బీజేపీ 36 చోట్ల విజయం సాధించేందుకు అవకాశాలుండగా ఎస్పీ, బీఎస్పీ కూటమికి (కాంగ్రెస్‌ లేకుండా) 42 స్థానాల్లో గెలవొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్‌ కేవలం 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అయితే మహాకూటమి నుంచి బీఎస్పీ విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ మళ్లీ 70 చోట్ల గెలుపొందే వీలుంది.

రాజస్తాన్ లో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్నా బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో గెలిచేందుకు అవకాశమున్నట్లు సర్వే తెలిపింది. 29 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ లో బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్‌ 6 చోట్ల గెలవనున్నట్లు తెలిసింది. 40 సీట్లు ఉన్న బీహార్ లో ప్రస్తుతం ఉన్న పొత్తులు కొనసాగితే జేడీయూ చేరికతో ఎన్డీయే బలం 31కి పెరుగుతుందని సర్వే పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కలిసి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అయితే ఆర్ ఎస్ ఎల్ పి, ఎల్ జే పిలు యుపిఏలో జేరితే యుపిఏ 18 సీట్లను, ఎన్డియే 22 సీట్లను గెల్చుకుంటాయి.

కర్ణాటక (28 సీట్లలో)లో కాంగ్రెస్, జేడీఎస్‌లు వేర్వేరుగా పోటీ చేస్తే సంయుక్తంగా 10 సీట్లు గెలుస్తాయని సర్వే పేర్కొంది. బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో, జేడీఎస్‌ 2 చోట్ల గెలుస్తాయని వెల్లడైంది. కాంగ్రెస్, జెడిఎస్ కూటమిగా పోటీ చేస్తే కాంగ్రెస్ మరో మూడు సీట్లను గెల్చుకొంతుంది గాని జెడిఎస్ సీట్లు మాత్రం పెరిగే అవకాశం లేదు.

పశ్చిమ బెంగాల్ లో మమత పోరాటగడ్డపై ఈసారి బీజేపీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకానుందని సర్వే తెలిపింది. మొత్తం 42 సీట్లలో బీజేపీ 16 చోట్ల గెలిచేందుకు వీలుందని తేలింది. 2014లో 34చోట్ల విజయం సాధించిన మమత ఈసారి 25 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. గుజరాత్ లోని 26 సీట్లలో బిజెపి 24, కాంగ్రెస్ 2 సీట్లు గెల్చుకొనే అవకాశం ఉంది.

బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్రలో శివసేన ఒంటరిగా పోటీచేసి, కాంగ్రెస్, ఎన్సీపీ కలసి పోటీ చేస్తే బిజెపికి 16, యుపియేకి 30, శివసేనకు 2 సీట్లు వస్తాయి. బిజెపి, శివసేన కలసి పొటీ చేస్తే ఎన్డియేకి 36, యుపియేకు 12 సీట్లు వస్తాయి.

ఓడిస్సాలోమొత్తం 21 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల, బీజేడీ 6 చోట్ల గెలవనుండగా, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో పాగా వేయొచ్చని తేలింది. ఇక పంజాబ్ లో బిజెపికి 1 సీట్ మాత్రమె రానున్నది. కాంగ్రెస్ 12 సీట్లు గెల్చుకొంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లున్న (13) అస్సాంలో బీజేపీ సీట్లు 7 నుండి 9కి పెరుగుతాయి. కాంగ్రెస్‌ 4, స్వంతంత్రులు ఒక చోట గెలిచే వీలుందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన 11 స్థానాల్లో ఎన్డీయే 9 చోట్ల, యూపీఏ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.