అద్వాని, కన్శిరాం, ప్రణబ్ లకు `భారత్ రత్న’

అద్వాని, కన్శిరాం, ప్రణబ్ లకు `భారత్ రత్న’

 

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన `భారత్ రత్న’కు అర్హులైన ప్రముఖుల ఎంపిక పక్రియను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నలుగురికి ఈ పురస్కారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలిస్తున్న పేర్లలో బిజెపి అగ్రనాయకుడు యల్ కే అద్వాని, బిఎస్పి స్థాపకులు కాన్షిరామ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు దక్షిణాదికి చెందిన ఒక ప్రముఖునికి కుడా ఈ పురస్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాని ఈ విషయంలో వ్యుహత్మకగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని బిజెపి సేనియర్లలో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు అద్వానికి ఈ గౌరవం అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న అత్యంత సీనియర్ నేత ఆయనే కావడం గమనార్హం.

 

ఇక బిజెపి దళిత వ్యతిరేకి అని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి గండి గొట్టడం కోసం దేశంలో దళితులను రాజకీయంగా చైతన్యం చేసి, సమీకరించడంలో కీలక భూమిక వహించిన కాన్షిరామ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. బిఎస్పి అధినేత్రి మాయావతి ప్రభావాన్ని కీలకమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పరిమితం చేయడానికి కూడా ఇది ఉపయోగ పడగలదని భావిస్తున్నారు.

 

మరోవంక సుదీర్ఘ కాంగ్రెస్ రాజకీయాలలో మునిగి తేలిన అనుభవం ఉన్న ప్రణబ్ ముఖేర్జికి ఈ పురస్కారం అందించడం ద్వారా సోనియా – రాహుల్ గాంధీ నిర్లక్ష్యానికి గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లను ఆకట్టుకోవడంతో పాటు, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్త్రాలలో రాజకీయంగా పట్టు గల సామాజిక సమీకరణాలను ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

 

ఇక దక్షిణాదిన ఈ మధ్యనే మరణించిన యం కరుణానిధికి భారత రత్న పురస్కారం అందించాలని డియంకే నేతలు స్వరాలు వినిపిస్తూ ఉండడంతో జయలలితకు కుడా ఇవ్వాలని అంటూ అన్నాడియంకే వర్గాలు కోరుతున్నాయి. అయితే వారిద్దరికీ ఇచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపిఫై వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రస్థాయిలో చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభావాన్ని తగ్గించడం కోసం తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టి రామారావుకు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

 

కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తిగా టిడిపిని మలచిన ఎన్టిఆర్ కు ఈ పురస్కారం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్న చంద్రబాబునాయుడును కట్టడి చేయవచ్చని, టిడిపి అభిమనులలోనే చీలిక తీసుకు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకేసారి ముగ్గురికి మించి ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చిన సాంప్రదాయం లేదు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని అధికమిస్తారా అన్నది ప్రశ్న !