ఆస్పత్రి నుంచి బ్రిటన్ ప్రధాని డిశ్చార్జ్‌ 

కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌  ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. 

అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఏప్రిల్‌ 5న హాస్పిటల్‌కు వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు.  

అయితే ఇప్పుడు ఆయన కోలుకున్నారని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. వైద్య బృందాల  సూచన మేరకు ఆయన తిరిగి తన వర్క్ ను వెంటనే ప్రారంభించరని తెలిపాయి.  

కాగా, సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన  నేషనల్‌ హెల్త్ సిబ్బందికు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్‌ పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్ లో ఇప్పటివరకు 78,991కరోనా కేసులు నమోదుకాగా, 9,875 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.