ఏపీలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు 

ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆయన సూచించారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని చెబుతూ వీలైనంత త్వరగా పంపిణీ జరగాలని  అధికారులను  ఆదేశించారు. 

కరోనా నివారణా చర్యలపై జరిపిన సమీక్షలో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రికి వరకు 32,349 మందిని ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు వైద్యాధికారులకు రిఫర్‌చేశారని..  ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, వీరే కాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. 

అదేవిధంగా కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు వైద్య శాఖ సిద్ధమవుతోందని అధికారులు చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని పేర్కొన్నారు. 

హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.  నమోదవుతున్న కరోనా కేసులు, వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం చెప్పారు.

ఇలా ఉండగా, ఏపీలో మొత్తం నమోదైన కేసులు 417. వీరిలో విదేశాలనుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12. ఢిల్లీ వెళ్లొచ్చినవారిలో పాజిటివ్‌ కేసులు 199, వారి ద్వారా వైరస్‌ బారినపడినవారు 161 మంది. మిగిలిన పాజిటివ్‌కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారిద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది.