ఎపిలో జగన్, తమిళనాట స్టాలిన్ ప్రభంజనం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్‌ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గత రాత్రి రిపబ్లిక్‌ టీవీలో ప్రసారమయ్యాయి.

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్‌ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.

అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్‌సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్‌సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. నాడు వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. 

అయితే టిడిపి, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే టిడిపి 8, కాంగ్రెస్ కు 4 సీట్లు గెలుచు కొంటాయని, అప్పుడు వైసిపి సీట్లు 13కు తగ్గుతాయని ఈ సర్వే తెలిపింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యతతో ఉన్నా, ఆ పార్టీ సీట్లు 11 నుండి 9కి తగ్గి యుపిఎకు 6, బిజెపి ఏంఐఏం లకు చెరో ఒక సీట్ వస్తుంది.

మొత్తం దక్షిణాదిలో జగన్ మోహన్ రెడ్డి తో పాటు తమిళ్ నాడులో డి ఏం కే అధినేత ఏం కే స్టాలిన్ రాజకీయంగా మంచి ప్రయోజనం పొందుతారు. ఒక కర్ణాటకలో బి ఎస్ యడ్డ్యురప్ప, కేరళలో కాంగ్రెస్ సహితం ఘన విజయాలు సాధించగలరు.

కర్ణాటకలో బిజెపికి మొత్తంగా ఉన్న 28 సీట్లలో 18 సీట్లు లభిస్తాయి. కాంగ్రెస్ కు 7లభించగా, జెడిఎస్ సీట్లు 3 నుండి 2కు తగ్గుతాయి. కాంగ్రెస్, జెడిఎస్ కలసి పోటీ చేస్తే కాంగ్రెస్ సీట్లు 10కి పెరుగుతాయి గాని, జెడిఎస్ మాత్రం తన బలాన్ని పెంచుకోలేదు. అప్పుడు బిజెపి సీట్లు 3 తగ్గే అవకాశ ముంది.

ఇక తమిళ్ నాడు లోని 39 సీట్లలో 28 సీట్లను డిఎంకె గెలుచుకొని జాతీయ రాజకీయాలలో సహితం కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. బిజెపికి 2, ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడిఎంకే కు 9 సీట్లు లభించే అవకాశం ఉంది. కేరళలోని 22 సీట్లలో కాంగ్రెస్ 16 సీట్లు గెల్చుకొంటుంది. ఎల్ డి ఎఫ్ కు 4, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది.