రోగ నిరోధక శక్తి పెంచే ఆయుర్వేదం    

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. రోగ నిరోధక శక్తితోనే ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కోవచ్చని నేడు ప్రపంచం అంతా చెబుతున్నది.  కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఆయుర్వేదంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచిస్తున్నది. 

* లవంగాలు పొడిచేసుకొని చక్కెర, తేనెలో కలిపి రోజూ రెండుమూడుసార్లు తినాలి. పొడి దగ్గ, గొంతు మంటగా ఉన్నప్పుడు ఇవి పాటించొచ్చు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. 

* గొంతు నొప్పిగా ఉన్నా, పొడిబారినా పుదీనా ఆకులు, వామ వాసన చూడాలి.

* ఒక స్పూన్‌ నువ్వుల నూనె,  కొబ్బరినూనెతో ఆయిల్ పుల్లింగ్ థెరపీని రోజుకు రెండుసార్లు చేయాలి.

* జలుబుగా ఉంటే ముక్కు రంధ్రంలోకి నువ్వుల నూనె, కొబ్బరి నూనె పూయాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఈ ప‌ని చేయాలి.

* రోజూ పసుపుపాలు తాగడం కూడా మంచిది. 150 మిల్లీలీటర్ల పాలలో అర స్పూన్‌ పసుపు కలిపి రెండు పూట‌లా తాగుతుండాలి.

* తులసీ, దాల్చినచెక్క, మిరియాలు, సొంఠి చేసిన హెర్బల్ టీని రోజూ రెండుసార్లు తాగాలి. బెల్లం, నిమ్మరసం కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 

* వంటలో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాలి.

* రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలి. 

* రోజంతా వేడినీళ్లు తాగుతూనే ఉండాలి. ఇలా తాగడం వల్ల శరీరంలోన వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి.

ఇలా  ఉండగా,కరోనా వైరస్ నివారణ కోసం ఔషధాల అన్వేషణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఆయుర్వేదం ద్వారా కోవిడ్ -19 కు నివారణను కనుగొనే పని చేపడుతుంది. 

ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తదితర  సంస్థలు ఆయుర్వేదం, సాంప్రదాయ ఔషధాల ద్వారా ఈ ప్రమాదకరమైన వ్యాధిని అధిగమించే దిశగా పరిశోధనలు సాగిస్తున్నాయి. 

ఈ విషయమై కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోనాయక్ మాట్లాడుతూ ప్రధాని మోదీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. కోవిడ్  -19 నివారణకు ఆయుర్వేద వైద్య సూత్రాలను అనుసరించి సాంప్రదాయ ఔషధాలు రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ టాస్క్‌ఫోర్స్ ఐసిఎంఆర్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.