లాక్‌డౌన్‌ సమయంలో రెట్టింపైన గృహ హింస కేసులు  

కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలన్నీ కోవిడ్‌-19 నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమవుంటూ ఉండడంతో సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస గణనీయంగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. 

లాక్‌డౌన్‌తో ఉపాధి పోయిందన్న బాధ, నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితితో భర్తలు తమ అసహనాన్ని భార్యలపై చూపుతున్నట్లు కేసులను బట్టి తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో భారత్‌లోనూ గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు . ఇండ్లలో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై ప్రదర్శిస్తున్నారని.. నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు తమ గోడును  ఎవరికి, ఎలా చెప్పకోవాలో తెలియక సతమతమవుతున్నారని రేఖాశర్మ పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలోనే  వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, గృహిణులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ +91 7217735372 ను కేటాయించింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధలో ఉన్న లేదా గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతు, సహాయం కోసం మహిళా కమిషన్‌ వాట్సాప్‌ నంబర్‌  ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయం   లాక్‌డౌన్‌ ముగిసేవరకు కొనసాగుతుంది. 

ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడటం, జీతాలతో కోత, వ్యాపారాలు - ఇతర ఆదాయ మార్గాలు కుంచిందుకు పోవడంతో ఏర్పడిన అసహనాన్ని ఇంట్లో ఉండే జీవిత భాగస్వామిపై చూపించడం జరుగుతున్నది. పైగా, ఇంటి పనులలో సహకరించక పోవడం సహజంగానే భార్యలలో అసహనాన్ని కలిగిస్తున్నది. పైగా, బాధితులు 24 గంటలు భర్తలతో కలసి ఉంటుండడంతో వారు ఫిర్యాదు చేయడానికి సహితం అవకాశం ఉండడం లేదు. 

మరోవంక, చాలామంది మహిళలు ఇప్పుడు ఇంటి పనులలో పనివార్లపై ఆధార పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పనివారలు వచ్చే అవకాశాలు లేకపోవడం, వస్తున్నా వారుంటున్న కాలనీ వారు అనుమతించక పోతూ ఉండడంతో ఇంటి పని చేసుకోలేక మహిళలతో అసహనం పెరుగుతున్నది. సహకారం అందించని భర్తలపై ఆగ్రహం కూడా కలుగుతుంది. 

ఇటువంటి సందర్భాలలో జోక్యం చేసుకోవడం చాలా సున్నితమైన అంశమని మహిళా ఉద్యమకారులు భావిస్తున్నారు. వారల తరబడి, బైటకు వెళ్లకుండా కలసి ఉంటూ ఉండడంతో, వారి వివాదాలలో జోక్యం చేసుకొంటే మహిళలకు మరింత హాని కలిగించినవారవుతామనే భయం కూడా వారిని వెంటాడుతున్నది.