లాక్ డౌన్ అతిక్రమణ దారులపై కొరడా 

కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న పలు చర్యలలో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంత మంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు అతిక్రమణ దారులపై కొరడా జులిపిస్తున్నారు. 

ఇప్పటికే 478 కేసులు నమోదు చేసిన పోలీసులు వేలాదిగా వాహనాలను జప్తు చేయడం జరిగింది. ఇప్పటికే నగరం మొత్తం మీద 7 లక్షల పైగా ఉన్న సిసిటివి కెమెరాలలో, సైబరాబాద్ లో ఉన్న 1.15 లక్షల కెమెరా లను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. వీటి ద్వారా రోడ్ల మీద ప్రజల కదలికలు ఎప్పటి కప్పుడు గమనిస్తున్నారు. 

పైగా, పలు ప్రాంతాల్లో ద్రోన్ల ద్వారా ప్రజల కదలికలు పసిగట్టి చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పుడు పోలీసు వారి అమ్ముల పొది లో మరో సాంకేతిక అస్త్రం జత అయ్యింది. ఇదే “లాక్ డౌన్ వయొలేషన్ ట్రాకింగ్ అప్లికేషన్”. దీనిని తెలంగాణ పోలీసు శాఖ తయారు చేయగా, అన్ని చెక్ పోస్టులలో ఉన్న అధికారులకు టాబ్ లలో ఇన్స్టాల్ చేశారు. 

ఎవరైనా ఒక వ్యక్తి రోడ్ మీదకు వచ్చిన వెంటనే సమీపం లో ఉన్న పోలీసు అధికారి అతని వివరాలు టాబ్ లో నమోదు చెస్తారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిధి లో మాత్రమే, అది కూడా కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్లవచ్చు. అది కూడా జిఓ 45, 46 లలో పేర్కొన్న నిబంధనల మేరకు, మోటార్ సైకల్  పై ఒక వ్యక్తి, కార్ లో డ్రైవరు కాక మరొక వ్యక్తి కి మాత్రమే అనుమతి ఉంటుంది. 

ఒక వేళ ఎవరైనా ఈ మూడు కిలో మీటర్ల పరిధిని దాటినట్లైతే అట్టి వ్యక్తి వాహనాన్ని జప్తు చేసి, వారిపై “జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం”, “అంటు వ్యాధుల నివారణ చట్టం”, “భారతీయ శిక్షా స్మృతి” మేరకు కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు  తీసుకొంటారు.  దీన్ని అతిక్రమించిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా పడే అవకాశం ఉంది. 

కాగా, జప్తు చేసిన వాహనాలను ఇప్పట్లో విడుదల చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రజలు ఎవరైనా కూడ అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని,  ఒక వేళ అత్యవసరంగా రావాల్సి వస్తే, నిబంధనల మేరకు మాత్రమే రావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ప్రతి చిన్న అవసరానికి బయటకు రాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు సరి పోయేలా అన్ని రకాల నిత్యావసరాలను ఒకేసారి కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.  ఈ విధంగా బయటకు తప్పని సరి పరిస్థితుల్లో వచ్చిన వారు కూడా, ఖచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు. 

మనుషుల మధ్య కనీసం 3 మీటర్ల దూరం పాటించాలి. రోడ్ల మీద అనవసరంగా ఉమ్మ కూడదు. తరచుగా తమ చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కొవాలి. లేదా శానిటైజర్ ఉపయోగించ వచ్చు.