తెలంగాణలో 30 దాకా కఠినంగా లాక్‌డౌన్

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఏప్రిల్ 30 తరువాత పరిస్థితిని బట్టి దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని, ప్రధానమంత్రి నరేంద్రమోడికి పంపుతున్నట్లు వెల్లడించారు. 

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తున్నామని సిఎం ప్రకటించారు. అయితే పదవ తరగతి పరీక్షల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయంతో పాటు అన్ని రకాల ఆహార ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు, నిత్యావసరాల తయారీ పరిశ్రమలు, కాయగూరల విక్రయాలను లాక్ డౌన్ నుంచి మినహాయించామని వెల్లడించారు. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని సిఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శనివారం మరో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని,  దీంతో మొత్తం కేసుల సంఖ్య 503కు చేరుకుందని తెలిపారు. ఇప్పటివరకు 96 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని, 14 మంది చనిపోయారని, ఇంకా 393 మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిదశలో క్వారంటైన్‌లో ఉంచిన మొత్తం 25,933 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు సంబంధించి 1654 క్వారంటైన్‌లో ఉన్నారని వివరించారు. 

ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని కెసిఆర్ తెలిపారు. వైరస్ ఇతర ప్రాంతాలకు సోకకుండా కంటైన్‌మెంట్ (వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు) క్లస్టర్లుగా 243 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. ఇందులో జిహెచ్‌ఎంసి పరిధిలో 123 ప్రాంతాలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయన్నారు. అయితే ఇందులో ఎవరి పరిస్థితి సీరియస్‌గా లేదని తెలిపారు. 

ఇక్కడ మొత్తం నిత్యావసరాలు డోర్ డెలివరీ చేసుతన్నట్లు తెలిపారు. ఇక కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 24 తరువాత కరోనా నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడినట్లేనని భరోసా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సరిహద్దును పూర్తిగా సీల్ చేసే ఆలోచన చేస్తున్నట్లు సిఎం తెలిపారు.

రాష్ట్రాల రుణాలపై కేంద్రం డిఫర్మెంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేసీఆర్ వెల్లడించాయిరు. రాష్ట్రానికి ఈ నెలలో ఇప్పటికి రూ 4,000 కోట్లు రావలసి ఉంటె, రూ 100 కోట్లే వచ్చాయని సీఎం చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

అప్పులు కడితే, తినడానికి ఉండదు. కేంద్రానికి, రాష్ట్రానికి ఆదాయం లేదు. ఈ సమయంలో క్యూ.ఇ విధానం మేలుగా వివరించారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.