కొత్త ఆంక్షలతో మూడు జోన్లుగా లాక్‌ డౌన్!

లాక్ డౌన్ పొడిగించాలని దేశంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్న దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు, ఆంక్షలతో వచ్చే రెండు వారాలు దేశాన్ని నడిపించాలని కేంద్రం ప్రణాలికను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా దేశాన్ని మూడు జోన్లుగా విభజించి లాక్ డౌన్ అమలు పరచాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

రెండు వారాల లాక్ డౌన్‌ తో పాటు వచ్చే 3,4 వారాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. గత 18 రోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది. దాన్ని మరో రెండు వారాల పాటు పొడించాలన్న రాష్ట్రాలు, రాజకీయ పక్షాల సూచన మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ పొడింగించడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

అయితే ప్రస్తుతం ఉన్న విధి విధానాల తోనే లాక్ డౌన్ పొడిగించడం కంటే కొన్ని మార్పులు చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రాల నుండి వచ్చిన సమాచారంతో పాటు, వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకున్న ప్రధాని మోదీ దేశంలో లాక్ డౌన్ అమలు కు కొన్ని కొత్త విధి విధానాలను అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. 

అందుకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ కొత్త మార్గ దర్శకాలను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తున్నది. దేశాన్ని మొత్తం మూడు జోన్లు గా విభజించి.. లాక్ డౌన్‌ ని పక్కాగా అమలు చేయాలని మోదీ హోం శాఖకు సూచించిన్నట్లు చెబుతున్నారు. దానికి అనుగుణంగా రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లు గా దేశాన్ని విభజించి.. లాక్ డౌన్‌ ను ఏప్రిల్ నెలాఖరు దాకా పొడిగించ బోతున్నారు.

1. రెడ్ జోన్ అంటే.. ప్రస్తుతం కంటైన్మెంట్ క్లస్టర్లు గా భావిస్తున్న ఏరియాలు. ఆ క్లస్టర్లు (జోన్లు) అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్ట బోతున్నారు.

ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటికి రాకుండా చూడడంతో పాటు.. వారికి కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు.. ఇతర పదార్థాలను వారి ఇళ్ళ వద్దకే సరఫరా జరిగేలా చూస్తారు. ప్రజా సంచారాన్ని ఏ మాత్రం అనుమతించ కుండా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటారు.

2. ఇక ఎల్లో జోెన్ అంటే.. ఎంతో కొంత కరోనా ప్రభావం వుండే అవకాశం వున్నవి. ఇలాంటి చోట్ల నిర్దిష్టమైన సమయంలో ప్రజా సంచారాన్ని అనుమతిస్తారు. కొన్ని రకాల షాపులను తెరిచేందుకు అనుమతిస్తారు. కొంత మేరకు సాధారణ జన జీవనం కొనసాగేలా చూస్తారని సమాచారం.

3. ఇక గ్రీన్ జోన్‌ లో కరోనా ప్రభావం ఏ మాత్రం లేని గ్రామీణ ప్రాంతాలు ఉండ బోతున్నాయి. దేశం లో రబీ దిగుబడులు వస్తున్నందున ఈ సమయంలో అక్కడ లాక్ డౌన్ కొనసాగితే .. రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతాయని భావిస్తూ.. గ్రామీణ ప్రాంతాలను గ్రీన్ జోన్‌లో పెట్టడం ద్వారా వ్యవసాయోత్పత్తుల క్రయ, విక్రయాలను అనుమతిస్తారు. 

కానీ.. భారీ ఎత్తున జనం పోగవడానికి మాత్రం అనుమతించరు.
అదే సమయంలో దేశ వ్యాప్తంగా భారీ సభలు, సమావేశాలు, వివాహాలు, మత సంబంధమైన సమూహాలు ఏర్పాటు చేయడం వంటివి మాత్రం నిరవధికంగా నిషేధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.