లాక్ డౌన్ పొడగింపుకు సిద్ధం కావాలి  

దేశ హితం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాన్ని బీజేపీ శ్రేణులు అమలయ్యేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కోవిడ్ 19 నివారణకు మరిన్ని రోజులు లాక్ డౌన్ పొదగించే అవకాశం ఉన్న తరుణంలో పేద ప్రజలు, వలస కూలీలు, కార్మికులకు అన్నదానం, నిత్యావసర వస్తువులు సమకూర్చడంలో బీజేపీ కార్యకర్తలు ముందుండలని కోరారు. 

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మార్కజ్ కేసుల దృష్ట్యా మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు అనివార్యం అయ్యే అవకాశం ఉన్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా బీజేపీ కార్యకర్తలు చూడాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు సామాజిక దూరం పాటిస్తూనే సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం తగదని హితవు చెప్పారు. 

 కాగా, ప్రధానమంత్రి సహాయ నిధికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి భూమ్ రావు  సంజయ్ కుమార్ కు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో 5 లక్షల చెక్కును అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఒక తాటిపై నడవాలని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు పని కట్టుకొని ప్రచారం చేస్తూ ప్రభుత్వ చర్యలను విమర్శించడం తగదని స్పష్టం చేశారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ వారి సూచనలకు అనుగుణంగా బిజెపి కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కొనియాడారు. ఇప్పటివరకు చేస్తున్న దానికంటే మరింత ఉదృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలను కోరుతున్నాని చెప్పారు.