అవినీతిలో పోటీపడుతున్న ఇద్దరు చంద్రులు: జివిఎల్

తెలుగు రాష్త్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అవినీతి చక్రవర్తులని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు ద్వజమెత్తారు. దేశంలో ప్రజా ప్రతినిధుల అవినీతిపై జరిగిన సర్వేలో కేసీఆర్, చంద్రబాబునాయుడు  మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నారని చెప్పారు. వారిద్దరూ అభివృద్దిలో కాకుండా అవినీతి కార్యకలాపాలలో, అప్పులు చేయడంలో కుడా పోటీ పడుతున్నారని హైదరాబాద్ లో విమర్శించారు.

బిజెపికి అడ్డువచ్చిన ఏ పార్టీ అయినా మట్టికరవక తప్పదననే విషయాన్ని టీఆర్‌ఎస్, టీడీపీలు గుర్తించుకోవాలని జివిఎల్ హెచ్చరించారు. బీజేపీ అంటే టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు భయం ఏర్పడిందని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వికృత రూపం చూపిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసారు.  ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తన పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను వెబ్ సైట్ నుంచే తొలగించారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కుటుంబపాలనకు తెరతీశారని ఆరోపించారు. ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదని, కుటుంబ సభ్యులకు మాత్రం మంత్రి పదవులిచ్చారని తెలిపారు.

చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ను రాహుల్ గాంధీతో పోల్చుకుంటున్నారని పేర్కొంటూ  కాంగ్రెస్ ముక్త్ భారత్‌గా రాహుల్ చేయాగా, లోకేశ్ మాత్రం టీడీపీ ముక్త్ ఏపీగా చేస్తారని జివిఎల్ ఎద్దేవా చేసారు. ఓటుకు నోటు కేసు తెరమీదకు రాగానే చంద్రబాబు హఠాత్తుగా హైదరాబాద్ నుంచి దొంగలా పారిపోయారని అపహాస్యం చేశారు. 

ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్తున్నారో ఇప్పటికీ చెప్పడం లేదని జివిఎల్ విస్మయం వ్యక్తం చేసారు. గత ఎన్నికల్లో 65 సీట్లే గెలిచినా ఏదో విధంగా సభ్యులను పెంచుకున్న కేసీఆర్‌కు, నిర్ణయాలను తీసుకోవడంలో ఏ పార్టీ అడ్డం పడే పరిస్థితిలో లేదని, అటువంటప్పుడు ముందస్తుగా ఎందుకు ఎన్నికలకు వెళ్తున్నారని నిలదీశారు. ఉద్యమంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించినందునే అధికారం అప్పగిస్తే పారిపోయారని విమర్శించారు.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే నరేంద్రమోడీ కారణంగా ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని జివిఎల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయలేక, మహా కూటమి పేరుతో తెలంగాణలో పోటీ చేస్తోందని తెలిపారు. ఈ కూటమి రాబందుల కూటమని, తెలంగాణ ద్రోహుల దుష్ట కూటమైన ఇది కేసీఆర్ మిగిలించింది  దోచుకోవడానికే వస్తోందని ద్వజమెత్తారు.

తాము టిడీపీ శనిని వదిలించుకోగా ఆ శని ఇప్పుడు కాంగ్రెస్‌కు అంటుకుందని ఎద్దేవా చేసారు. బిజెపి కారణంగానే తుప్పు పట్టిన సైకిల్ ఏపిలో అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీతో బిజెపియే నష్టపోయినదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపిలో ఉనికి కోసం ఆరాటపడుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ అంశంలో ఎన్నికల్లో లబ్ది పొందాలని కాంగ్రెస్ నేతలు తంత్రం, కుతంత్రాలకు పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ మాత్రమే మాట మీద నిలబడి తెలంగాణకు మద్దతుగా నిలబడిందని గుర్తు చేసారు. తమదే నిజమైన తెలంగాణ పార్టీ అని స్పష్టం చేసారు.  ప్రజలకు కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.