లాక్‌డౌన్ ఉల్లంఘనలపై మమతాపై కేంద్రం ఫైర్ 

కోవిడ్-19 లాక్‌డౌన్ చర్యల విషయంలో తీవ్ర ఉల్లంఘనలపై పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ  ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిలదీసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి శనివారండు ఒక లేఖ రాసింది. 

రాజబజార్, నార్కెల్ డాంగ, టాప్‌సియా, మెతియాబ్రుజ్ వంటి ఏరియాల్లో పెద్ద స్థాయిలో లాక్‌డౌన్ ఉల్లంఘనలు, సామాజిక దూరం పాటించకపోవడం వంటివి చాలా స్పష్టంగా జరుగుతున్నట్టు ఆ లేఖ పేర్కొంది. మతపరమైన కార్యక్రమాల్లో జనం పెద్దఎత్తున గుమిగూడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ఎంహెచ్ఏ ప్రశ్నించింది. 

సంస్థాగత సరఫరా వ్యవస్థ ద్వారా కాకుండా రేషన్‌ను రాజకీయ నాయకుల ద్వారా పంపిణీ చేయిస్తుండటాన్ని కూడా నిలదీసింది. కరోనా విస్తరణకు ఇవి కారణాలమవుతున్నాయని మండిపడింది. ఈ విషయంలో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మొత్తం వ్యవహారంపై తక్షణం నివేదిక అందించాలని కూడా ఎంహెచ్ఏ ఆదేశించింది. 

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.పశ్చిమ బెంగాల్‌లో ఇంతవరకూ 116 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల్లో 89 యాక్టివ్ కేసులు కాగా, 22 మందికి స్వస్థత చేకూరింది.