రెండు వారాలపాటు లాక్‌డౌన్‌  పొడిగించే అవకాశం 

ఈ నెల 14న ముగియనున్న   లాక్‌డౌన్‌ ను మరో రెండు వారాలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి, రెండు రోజులలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. 

అందుకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. దాదాపు ముఖ్యమంత్రులు అందరూ పొడిగించాలని కోరుతున్నారు. లేని పక్షంలో మూడు వారాలలో చేసిన కృషి వృధా కాగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవంశం, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. నేడు 7,000 ల మార్క్ దాటింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1035 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని..40 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

'దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,447 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం వరకు 239 మంది కరోనా మహమ్మారి బారినపడి చనిపోయారు.  642 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవ తెలిపారు.    ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవని చెప్పారు. 

ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాదాపు అందరు పొడిగించాలని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 11 మంది ముఖ్యమంత్రులకు గాను 10 మంది లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపారని తెలుస్తున్నది. 

ఏప్రిల్ 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించాలని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు తొలుత సూచించగా, ఇతర సీఎంలు దానిని బలపరచారు. ఏప్రిల్ 14 తర్వాత కనీసం పక్షం  రోజులైనా లాక్‌డౌన్ పొడిగించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సూచించారు. ఏప్రిల్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. 

లాక్‌డౌన్ పొడిగించాలని కోరిన వారిలో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సీఎంలు ఉన్నారు. ఇక, మాయావతి, ఎంకే స్టాలిన్ వంటి రాజకీయ నాయకులు కూడా లాక్‌డౌన్ పొడిగించాలంటూ ఇవాళ వేర్వేరు ప్రకటనల్లో కోరారు.  

ఈ విషయంలో మనం రాజీపడవలసిన అవసరం లేదని వీడియో కాన్ఫరెన్సు అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి య‌డియూర‌ప్ప స్పష్టం చేశారు. మ‌రో 15 రోజుల‌పాటు లాక్ డౌన్ ను పొడిగించాల‌ని సూచించిన‌ట్లు చెబతూ ఒక‌ట్రెండు రోజుల్లో భార‌త ప్ర‌భుత్వం మ‌రో 15 రోజులు లాక్ డౌన్ పొడిగింపున‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేస్తుంద‌ని ప్రకటించారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే పొడిగించినందుకు ప్రధాన  మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కూడా.  

కాగా, కేవలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే లాక్‌డౌన్‌ను  రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. 

90 శాతం  పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయి. రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొంది. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందని అంటూ ఆయన ప్రధానికి వివరించారు.