24 గంటలూ సీఎంలకు అందుబాటులో ఉంటా 

24 గంటలూ అందరు ముఖ్యమంత్రులకు తాను అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా మాట్లాడవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.  ‘మీకు ఏ కష్టమొచ్చినా నాకు చెప్పండి’ అని కోరుతూ సమస్య నుంచి బయటపడేందుకు వ్యూహం ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు. 

‘‘24 గంటలూ మీకు అందుబాటులోనే ఉంటా. ఏ ముఖ్యమంత్రైనా నాతో మాట్లాడవచ్చు. కరోనా విరుగుడుకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. భుజం భుజం కలిపి... కరోనాపై విజయం సాధిద్దాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపు విషయంపై శనివారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి నరేంద్ర మోదీ బట్టతో కుట్టిన ‘హోంమేడ్ మాస్కు’ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రెసెంటేషన్‌ను అందించింది. ఈ ప్రజంటేషన్ ముగిసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రులు మోదీతో మాట్లాడారు. లాక్‌డౌన్ పొడగింపుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపుగా మొగ్గు చూపారు. ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడగించాయి కూడా. 

 రాష్ట్రాల వారిగా కంటే.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండాలని, అప్పుడే కరోనాను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు.. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, కిట్లు, మందులపై ప్రధాని సీఎంలకు పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. పరిస్థితులు మళ్లీ మొదటి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజల ప్రాణాలు కాపాడటం, వారి జీవనబృతులను కాపాడటంల మధ్య సమనవ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.