చైనా నుండి తరలిస్తున్న  జపాన్, అమెరికా కంపెనీలు 

అంతర్జాతీయ ఉత్పత్తి రాజధానిగా భాసిల్లుతున్న చైనాను ప్రపంచ దేశాలు కొద్దినెలల క్రితం వరకు తమ వర్క్‌షాప్‌గా చెప్పుకొన్నాయి. కానీ  చైనాపై అధికంగా ఆధారపడినందుకు ప్రపంచ దేశాలు ఇటీవల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిరావడంతో ఇప్పుడు  చైనాకు దూరంగా జరిగేందుకు తొందర పడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీస్థాయిలో వస్తువులను ఉత్పత్తిచేస్తున్న చైనా.. 2009 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతున్నది. 

ప్రపంచ దేశాలకు అనేక రకాల వస్తువులను ఎగుమతిచేస్తూ రోజురోజుకూ ఆర్థికంగా ఎంతో బలపడుతున్న చైనా.. ఈ ఏడాది తమ ఉత్పత్తులతోపాటు ప్రాణాంతక కరోనా వైరస్‌ను కూడా ప్రపంచానికి ఎగుమతి చేసింది. అదే ఇప్పుడు చైనా కొంప ముంచుతున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం యావత్‌ ప్రపంచ ప్రజలంతా వ్యక్తిగత దూరాన్ని పాటిస్తున్నారు. ఇదేవిధంగా చైనాతో ఆర్థిక దూరాన్ని పాటించడం శ్రేయస్కరమని పలు దేశాలు భావిస్తున్నాయి. 

ఈ దిశగా రెండు దేశాలు ఇప్పటికే (అమెరికా, జపాన్‌) కసరత్తు కూడా మొదలుపెట్టాయి. కరోనా వైరస్‌ వల్ల ఎదురైన భారీ నష్టం నుంచి గుణపాఠం నేర్చుకొంటున్న అమెరికా, జపాన్‌.. ఇప్పుడు చైనాలోని తమ సంస్థలను వెనక్కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ విషయంలో అమెరికా కంటే జపాన్‌ ముందంజలో ఉన్నది. 

కరోనా వైరస్‌పై పోరాడేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధించిన జపాన్‌ ప్రధాని షింజో అబే.. ఈ మహమ్మారి వల్ల తమ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టాన్ని తగ్గించుకొనేందుకు దాదాపు లక్ష కోట్ల డాలర్లతో భారీ ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఇప్పుడు జపాన్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో జపనీయుల ప్రాణాలను, ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన అవసరమున్నది' అంటూ స్పష్టం చేశారు. 

అందుకే 108 ట్రిలియన్‌ యెన్లతో కూడిన భారీ ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించారు. దీని విలువ  వారి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 20 శాతం మేరకు ఉంటుందని ఆయన వివరించారు. చైనా నుంచి వెలుపలికి వచ్చే జపాన్‌ సంస్థలకు చేయూతనిచ్చేందుకు ఈ ప్యాకేజీలో 220 కోట్ల డాలర్లను కేటాయించారు. 

ఇందులో చైనా నుంచి జపాన్‌కు తిరగొచ్చే సంస్థలకు 200 కోట్ల డాలర్ల సాయాన్ని, చైనా నుంచి ఇతర దేశాలకు తరలివెళ్లే జపాన్‌ సంస్థలకు 20 కోట్ల డాలర్ల సాయాన్ని అందజేయనున్నట్టు షింజో అబే ప్రకటించారు. తద్వారా చైనాలోని జపాన్‌ సంస్థలు స్వదేశానికి తిరిగి రావాలని, లేదంటే మరో దేశానికి తరలిపోవాలని, చైనాలో మాత్రం ఉండవద్దని ఆయన స్పష్టమైన సందేశమిచ్చినట్టయింది. 

మరోవైపు చైనా నుంచి అమెరికా కంపెనీలు వైదొలగడం గతంలోనే ప్రారంభమైంది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మొదలవడంతో దాదాపు 50 అమెరికన్‌ కంపెనీలు ఇప్పటికే చైనా నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతున్నది. ప్రస్తుతం మరో 200కుపైగా అమెరికన్‌ కంపెనీలు చైనా నుంచి భారత్‌లోకి రావాలని యోచిస్తున్నట్టు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అధ్యక్షుడు ముఖేశ్‌ అఘీ తెలిపారు. 

అమెరికాలో సంస్కరణలను వేగవంతం చేయడంతోపాటు విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించాల్సిందిగా కొత్త ప్రభుత్వానికి యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ సిఫారసు చేయనున్నదని చెప్పారు. చైనా నుంచి విదేశీ కంపెనీల నిష్క్రమణలతో ప్రధానంగా ఐదు దేశాలకు లబ్ధిచేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో భారత్‌ ముందు వరుసలో ఉన్నది. 

చైనాకు ఏమాత్రం తీసిపోనంత భారీస్థాయిలో కార్మికులను, మార్కెట్‌ను కలిగి ఉండటం, శ్రామికశక్తి చౌకగా అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ ఐదు దేశాల్లో భారత్‌ తర్వాత వియత్నాం, థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందక  ముందు వరకు వియత్నాం దాదాపు 5 వేల రకాల ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నది.