హిందువుల మనోభావాలు పట్టించుకోని తెలంగాణ 

 కోవిడ్19 వ్యాధితో చనిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 169లో మార్గదర్శకాలు, హిందువుల మనోభావాలను, సాంప్రదాయాలను పట్టించుకోలేధని, వాటికి పూర్తి విరుద్దంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.  

హిందువుల మనోభావలతో చెలగాటం ఆడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రపంచం అంతా కరోనా కట్టడికి కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ప్రజలకు సహకరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మతం పేరుతో జీవో లు విడుదల చేసి ప్రజల మధ్య వైషమ్యాలు స్పృష్టించడం తగదని హితవు చెప్పారు. 

ప్రభుత్వం జారీ చేసిన జీఓ-169లో ఉన్న మార్గదర్శకాలు, కేవలం ఒక వర్గాన్నిసంతృప్తి పర్చటం కోసం రూపొందించినట్లుగా ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.  కోవిడ్19 వ్యాధి మరణాల విషయం లో కూడా మత పరంగా ఈ వివక్షత ఎందుకని ప్రశ్నించారు. ఈ సమయంలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరమా అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 

తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా విడుదల చేసిన జీవో 169లో ఖననం వేళ కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించటం, హిందూ మత, ఆచార వ్యవహారాలకు ఇబ్బందికరం అని తెలిపారు. సామాజిక దూరం పాటించేలా , సంప్రదాయలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిగేలా చూస్తూ పుణ్య కార్యక్రమాలకు కావాల్సిన వారిని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అనుమాస్పద మృతులను, హిందూసంప్రదాయాల ప్రకారం ఖననం చేయడంపై ప్రభుత్వం పునరాలచోన చెయ్యాలని బండి సంజయ్ కోరారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ తో ఎక్కువగా ముస్లిం మతానికి చెందినవారు మరణించారు. వీరి ఖననంకు సంభందించిన ఆదేశాలను జీఓ-169లో పొందుపర్చకపోవటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు.  

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ జీవో విడుదల జరిగితే వెంటనే రద్దు చేయాలని. లేదంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.