20 వేల మంది విదేశీయులను తరలించాం  

కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో 20 వేల మందికి పైగా విదేశీయులను వారి దేశాలకు తరలించినట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆయా ప్రభుత్వాల అభ్యర్థన మేరకు వారందరినీ ప్రపంచలోని పలు ప్రాంతాలకు సురక్షితంగా తరలించామని వెల్లడించింది. 

‘‘ఏప్రిల్ 9 వరకు 20,473 మంది విదేశీయులను విజయవంతంగా ఖాళీ చేయించాం. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ప్రపంచంలోని వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. వారి నుంచి మాకు అద్భుతమైన సహకారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో విదేశాంగ శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి పనిచేస్తున్నాయి..’’ అని విదేశాంగ శాఖ ఏఎస్, కోవిడ్-19 సమన్వయకర్త దమ్ము రవి పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితిపై ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘దీనిపై మేము ఒక అంచనాకు రావాల్సి ఉంది. ఆ తర్వాతే భారతీయులను ఎలా తరలించాలన్న దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే ఆయా దేశాల్లోని భారతీయులతో అక్కడి రాయబారులు, హైకమిషనర్లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వారికి మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు హెల్ప్‌లైన్ల ద్వారా అన్ని విధాలా అండగా ఉంటున్నారు...’’ అని వివరించారు. 

ఇలా ఉండగా, భారత్‌కు కోటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 3.28 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీంతో దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రల స్టాకుపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి.

హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మాత్రలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారైన భారత్‌పై అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయిల్, యూరప్ దేశాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు పంపాలని భారత్‌ను కోరాయి. కొన్ని దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రల తయారీకి ముడి పదార్థాలు పంపాలని కూడా కోరాయి. 

ప్రపంచదేశాల విజ్ఞప్తి మేరకు సరిపడా స్టాకు ఉంచుకుని మిగతావి ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది. దీంతో కష్టకాలంలో భారత్‌ ఆదుకుంటోందని ప్రపంచ దేశాలు పొగడ్తలు కురిపించాయి. మలేరియా మందుగా పేరున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ కరోనాకు బాగా పనిచేస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌ను గేమ్ చేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. తొలుత కాదన్నా తర్వాత ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ట్రంప్ మోదీని ఆకాశానికెత్తేశారు కూడా. మిగతా దేశాధినేతలు కూడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ సరఫరాపై భారత నాయకత్వాన్ని అభినందించారు.