భారత్ కు ఎడిబి  220 కోట్ల డాలర్ల సహాయం 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై అలుపెరుగకుండా పోరాడుతున్న భారత్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అండగా నిలిచింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు 220 కోట్ల డాలర్ల (దాదాపు రూ.16,500 కోట్ల) ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఏడీబీ సిద్ధమైంది. 

ఈ మేరకు ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకవా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌పై పోరు కోసం భారత్‌ చేపడుతున్న చర్యలను అసకవా శ్లాఘించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న వ్యాపారులు, పేదలు, మహిళలు, కార్మికులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించేందుకు 2,300 కోట్ల డాలర్ల (రూ.1.7 లక్షల కోట్ల) ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నరేంద్రమోదీ సర్కార్‌ను అసకవా కొనియాడారు.

‘ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో భారత్‌కు అండగా నిలిచేందుకు ఏడీబీ కట్టుబడి ఉన్నది. దేశ ఆరోగ్య విభాగానికి చేయూతనివ్వడంతోపాటు కరోనా మహమ్మారి వల్ల పేదలు, అసంఘటిత కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై పడుతున్న దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు వీలుగా 220 కోట్ల డాలర్ల తక్షణ సాయాన్ని అందించేందుకు మేము సిద్ధమవుతున్నాం' అంటూ భరోసా ఇచ్చారు. 

అంతేకాకుండా ఈ విపత్కర సమయంలో ప్రైవేటు రంగాల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మున్ముందు భారత్‌కు మరింత సహాయాన్ని అందించేందుకూ మేము సిద్ధమే’ అని అసకవా ఓ హామీ ఇచ్చారు.