అమెరికా ఆంక్షలున్నా రష్యా ఎస్-400 కొనుగోలుకు సిద్దం

అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఆ దేశం నుండి అత్యాధునిక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుకు భారత్ సిద్దపడుతున్నది. గత సాయంత్రం రెండురోజుల పర్యటన నిమిత్తం పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే ఇండియా-రష్యా 19వ వార్షిక ద్వై పాక్షిక సమావేశానికి ప్రధాని మోదీతో కలిసి ఆయన హాజరవుతారు.

రక్షణరంగ సహకారం పై కీలక చర్చలతోపాటు, ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుపై ఇరుదేశాల మధ్య భారీ ఒప్పందం ఖరారు కానున్నది. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి వచ్చిన పుతిన్ గురువారం సాయంత్రం 6.30గంటలకు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు.

రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పుతిన్ లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. పుతిన్‌కు సాదరంగా స్వాగతం పలికిన మోదీ ఆయన కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. నేతలిద్దరూ విందు సందర్భంగా మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

అంతకుముందు రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో ట్వీట్ చేసిన మోదీ భారత్‌లో అడుగుపెట్టిన ప్రెసిడెంట్ పుతిన్‌కు స్వాగతం.. భారత్-రష్యా స్నేహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మన చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ హౌజ్‌లో పుతిన్, మోదీ మధ్య విస్తృత చర్చలు జరుగనున్నాయి. ఈ సమావేశంలోనే కీలక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థలతోపాటు, 4 క్రివాక్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందాలు ఖరారు కానున్నాయి.

రష్యా తయారు చేసిన ఎస్-400 ను ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థగా పరిగణిస్తా రు. ఇది శత్రువుల క్షిపణి దాడుల్ని పూర్తిగా అడ్డుకుంటుంది. రష్యా గతంలో రూపొందించిన ఎస్-300 క్షిపణి వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి తయారు చేసిన ఎస్-400 రష్యా సైన్యానికి 2007 నుంచి సేవలందిస్తున్నది. ఇప్పటికే రష్యా నుంచి ఎస్-400ను చైనా కొన్నా, ఎన్నింటిని కొన్నదన్న విషయం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఉపఖండంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 4,000 కిమీపొడవైన భారత్-చైనా సరిహద్దుల్లో ఎస్-400 లాంటి అత్యాధునిక వ్యవస్థలు అవసరమని భారత్ భావిస్తున్నది.

ఆ మేరకు రష్యాతో ఒప్పందానికి సిద్ధమైంది. మొత్తం 500 కోట్ల డాలర్లు (రూ.36,842కోట్ల)తో భారత్ వీటిని కొనుగోలు చేయనున్నది. ఒప్పందం విలువ అంతకుమించి ఉంటుందని పుతిన్ సన్నిహితుడు, విదేశాంగవిధాన నిపుణుడు యూరీ ఉషకోవ్ చెప్పారు. మరో 250 కోట్ల డాలర్ల (రూ.18,421 కోట్ల)తో నాలుగు క్రివాక్ యుద్ధనౌకలను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తున్నది. ఈ ఒప్పందంతో భారత నౌకాదళం మరింత బలపడనుంది. ఇప్పటికే మన నేవీలో ఆరు రష్యా తయారీ యుద్ధనౌకలున్నాయి.