ఏపీలో 133 రెడ్‌ జోన్ల గుర్తింపు 

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 133 రెడ్‌ జోన్లును వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. పాజిటివ్‌ కేసులున్న ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల చుట్టూ కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా తీసుకున్నారు. కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా గుర్తించినట్లు తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో బఫర్‌ జోన్లను ఏడు కిలోమీటర్ల వరకూ విస్తరించినట్లు వెల్లడించింది. అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ సేవలు నిర్వహించడం మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. 

అన్ని ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహణ, వాహనాల కదలికపై నిఘా, ప్రజారవాణా నిషేధం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. పాజిటివ్‌ పేషంట్లపైనా, వారితో సన్నిహితంగా వ్యవహరించిన వారి పైనా ఎఎన్‌ఎం, ఆశా ఉద్యోగుల చేత కచ్చితమైన నిఘా ఉంటుందని, వీరంతా దగ్గరలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యాధికారి పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపింది. 

మరోవైపు రాష్ట్రంలో శుక్రవారం 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఏడు, తూర్పు గోదావరిలో ఐదు, కర్నూలులో రెండు, ప్రకాశంలో రెండు, అనంతపురంలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా నియంత్రణకు టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డితో పాటు 13 మంది సభ్యులను నియమించింది.