మరోసారి చైనా దురాగతాన్ని వెల్లడించిన తైవాన్ 

ప్రపంచం పట్టించుకొనక పోయినా కరోనా వైరస్ విషయం దాచిపెట్టి చైనా ద్రోహం చేస్తున్నట్లు డిసెంబర్ లోనే వెల్లడించిన తైవాన్ ఇప్పుడు చైనా ఇంటర్నెట్ యూజర్లు కుట్ర పూరితంగా వ్యవహరించడాన్ని మరోమారు ప్రపంచం ముందు ఉంచింది. 

కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని చైనా ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిన చైనాతో వంతపాట పాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్‌ సహితం ఇప్పుడు అంతర్జాతీయంగా విమర్శలకు గురవడం తెలిసింది. అయితే తమతో `లాలూచి' పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘెబ్రెయెసుస్‌ పై సోషల్ మీడియాలో తమ పేరుతో జాత్యంకార వాఖ్యలు చేస్తూ చైనా చేసిన కూటుల యత్నాన్ని తైవాన్ బహిర్గతం చేసింది. 

ఘెబ్రెయెసుస్‌కు వ్యతిరేకంగా జాత్యహంకార కామెంట్లు చైనా పెడుతూ, వాటికి తైవాన్ పౌరుల ఫొటోలను, పేర్లను వాడుకోవడాన్ని వెల్లడించింది. తైవాన్ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అనేక మంది చైనీస్ ఇంటర్నెట్ యూజర్లు తైవానీయులుగా నటిస్తూ, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఘెబ్రెయెసుస్‌కు వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలను ప్రచురించినట్లు దర్యాప్తులో తేలింది. 

ఈ జాత్యహంకార వ్యాఖ్యలు పోస్ట్ చేసినవారి అకౌంట్లన్నీ చైనాకు చెందినవేనని వెల్లడైంది. వీరు ఉద్దేశపూర్వకంగానే తమ దేశ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని తైవాన్ ఆరోపించింది. 

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఘెబ్రెయెసుస్ బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కోవిడ్-19పై మాట్లాడుతూ తనపై వస్తున్న జాత్యహంకార వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొన్ని నెలల నుంచి తనపై తైవాన్ ఇంటర్నెట్ యూజర్లు జాత్యహంకార కామెంట్లు పెడుతున్నారని, తాను నీగ్రోనని, నల్లజాతివాడినని అంటున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

 పైగా,  తాను నీగ్రో, నల్లజాతి వ్యక్తిని కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. తాను ఇటువంటివాటిని పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు.  ఈ నేపథ్యంలో తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్ స్పందిస్తూ ఘెబ్రెయెసుస్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, నిరసన తెలిపారు. తమ దేశం అన్ని రూపాల్లోని వివక్షను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.