ఎస్ఇసి ర‌మేశ్ కుమార్‌కు ఉద్వాస‌న

తమతో మాట మాత్రం కూడా చెప్పకుండా పంచాయత్ ఎన్నికలను కరోనా  కారణం అంటూ ఆరు వారల పాటు వాయిదా వేసిన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ పై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేటు వేసింది. ర‌మేశ్ కుమార్‌ని తొల‌గిస్తూ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ ఆమోదం తెలపడంతో  ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జివోను జారీ చేసింది. ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఎస్ఇసి ర‌మేశ్ కుమార్‌కు ఉద్వాస‌న ప‌లికింది.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా గోప్యంగా జరిపించింది. అధికారికంగా ఎటువంటి  ప్రకటన చేయనే లేదు. ఐదేళ్ల కాలానికి నియమించిన ఎన్నికల కమీషనర్ ను అర్ధాంతరంగా ఆర్డినెన్సు ద్వారా ఏ విధంగా తొలగిస్తారని అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 

 కరోనా కారణంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నందున.. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అని గవర్నర్ కు పంపిన లేఖలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రమేష్‌ కుమార్‌ను మార్చేందుకు దొడ్డిదారిన సవరణలు చేశారని విమర్శించారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు చంద్రబాబు లేఖలో కోరారు.

ఎస్‌ఈసీ రమేష్‌పై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని ఎస్‌ఈసీపై వైసీపీ కక్ష కట్టిందని ఆరోపించారు. ఒక బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపితే కౌన్సిల్‌నే రద్దు చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రభుత్వానికి మంచిదికాదని కన్నా హితవుపలికారు. 

ఇలాంటి అరాచకాలకు ఇంతకుముందెప్పుడూ చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు.  ఇవన్నీ చూస్తుంటే రేపు హైకోర్టునూ రద్దు చేస్తారేమో? అనిఎద్దేవా చేశారు. సీఎం జగన్ అహంకారపూరిత చర్యలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని చెబుతూ పోలీసులకు కూడా వైసీపీ ఖాతా నుంచి జీతాలు ఇవ్వాలని కన్నా హితవు చెప్పారు.