కరోనా అదుపుకు ఐదారు వారాలు పట్టవచ్చు 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని గమనిస్తే పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా 5 నుంచి 6 వారాలు పట్టే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. 

అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో శుక్రవారం వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబేతో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్‌ భవన్‌ నుంచి హర్షవర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న చర్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

రాబోయే గడ్డు పరిస్థితులను ఎదుర్కొని తట్టుకునేందుకు భారతీయులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో ఉన్న కరోనా తీవ్రత.. అక్కడి పరిస్థితులు మన దేశ ప్రజలకు ఎదురుకాకూడదని హర్షవర్ధన్ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మరిన్ని క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ బెడ్స్, ల్యాబ్స్, టెస్టింగ్ కిట్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.   

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కొన్నిరాష్ట్రాలలో  కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. కరోనాను తరిమికొట్టడంలో అందరూ మాస్కులు ధరించడం అత్యంత ప్రధానం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, ఏప్రిల్ 14 లోగా కరోనా టెస్ట్ లను రెట్టింపుగా - అంటే 2.5 లక్షల వరకు జరపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. తాజా సమాచారం మేరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,412కు పెరగగా, మృతుల సంఖ్య 199కు చేరుకొంది. 503 మంది చికిత్స అనంతరం కోలుకొని ఇళ్లకు వెళ్లారు.