మాస్క్ లేవన్న మరో అధికారి సస్పెన్షన్ 

కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులకు కనీసం మాస్క్ లను కూడా  ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నందుకు ఒక ప్రభుత్వ వైద్యుడిని సస్పెండ్ చేసిన వై ఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా అటువంటి ఆరోపణలపైననే నగిరి మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డిఫై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. 

కరోనా రక్షణ పరికరాలు లేవంటూ వెంకటరామిరెడ్డి చేసిన సెల్పీ వీడియో కలకలం రేపడంతో.. ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్ధానంలో ఇన్‌చార్జ్ కమిషనర్‌గా సానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావును నియమించారు.

నగరిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా తమకు రక్షణ కవచాలు లేవంటూ ఆయన సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు రోజుల క్రితం నర్సీపట్నం ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ చేసిన వ్యాఖ్యలతో పాటు వెంకటరామిరెడ్డి చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. 

ఈ ఇద్దరి వ్యాఖ్యలు అటు వైద్యశాఖలో, ఇటు మున్సిపల్ శాఖలో ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోందని వీడియోలో వెంకటరామిరెడ్డి వాపోయారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో డబ్బులు ఖర్చు చేద్దామనుకుంటే అకౌంట్ ప్రీజ్ అయి ఉందని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. 

పైగా, ప్రభుత్వం నుండి రూపాయి రాకపోయినా ఎమ్మెల్యే రోజా ఇచ్చిన డబ్బులతోనే తాము సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పడం ప్రభుత్వంలోని పెద్దలకు ఆగ్రహం కలిగించినట్లు కనబడుతున్నది.  వెంటకరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో ప్రచారమయ్యాయి.