అది కూటమి కాదు... కాలకూట విషం : కెసిఆర్

ముందస్తు ఎన్నికల్లో తెలంగాణను మళ్లీ ఆగం చేసేందుకు ప్రగతి రథానికి అడ్డం పడుతున్న కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గులను ఓడించాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. నల్లగొండ మర్రిగూడ బైపాస్ మైదానంలో జరిగిన ప్రజాశీర్వాద బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీలది ‘అపవిత్ర కూటమి, మయాకూటమి, విషకూటమి’ అంటు తీవ్రస్వరంతో విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో టీడీపీకి కనీసం 15సీట్లు వచ్చినా కత్తి బొడ్డులో పెట్టుకుని తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు కొనసాగించి ప్రజలను అమరావతి గులాంలను చేస్తారని హెచ్చరించారు. దేశంలోనే రూ 42వేల కోట్లతో సంక్షేమంలో నెంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచి ప్రజలకు పంచుతున్న టీఆర్‌ఎస్ పాలనను చూసి కన్నుకుట్టిన కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమితో ప్రజలను వంచించి అడ్డగోలు ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నాయని ద్వజమెత్తారు.

68ఏళ్ల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలను గెలిపిస్తే మళ్లీ తెలంగాణ ఆగం కాకతప్పదని స్పష్టం చేసారు. నాగార్జున సాగర్ నుండి కృష్ణా నీళ్లు తెలంగాణ ప్రజలకు దక్కవని, డిండి ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టులు ముందుకు సాగవని,  రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఆగమవుతాయని హెచ్చరించారు.  తెలంగాణలో భూకబ్జాలు, మట్కాలు, జూదాలు, మతకల్లోలాలు, బాంబుదాడులు, పైరవీల ముఠాలు, రౌడీల మూకలు లేవని స్పష్టం చేసారు.

దేశంలోనే శాంతి భద్రతలతో తెలంగాణ అగ్రగామిగా ఉందని అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధిని ప్రణాళికతో తాను ముందుకు తీసుకెలుతుంటే కాంగ్రెస్ నాయకులు పొద్దున లేస్తే సొల్లు తిట్లకు దిగుతుండటంతో ప్రజాతీర్పును కోరేందుకు ముందస్తు ఎన్నికలకు వచ్చామని చెప్పారు. మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తాజా సర్వేలో ఎంఐఎం ఏడు సీట్లు మినహాయిస్తే టీఆర్‌ఎస్ 110సీట్లు గెలువనుందని తేలిందని ధీమా వ్యక్తం చేసారు.

ఆసరా పింఛన్లను పెంచుతామని పది రోజుల్లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ దీనిపై ప్రకటన చేస్తుందన్నారు. సొంత స్థలాలున్న వారికి డబుల్ బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందకుండా అడ్డుకున్న కాంగ్రెస్ దుర్మార్గులు రైతుబంధును కూడా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పునివ్వడంతో నేటి నుండి తెలంగాణలో రైతుబంధు చెక్కులు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలకు బతుకమ్మ ఛీరలిస్తామని చెప్పారు. పదవులు,పైరవీలు,కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గోస పట్టించుకోలేదని కేసీఆర్ తన ప్రసంగంలో ధ్వజమెత్తారు. మోదీతో తాను కలిశానంటు చెబుతున్న చంద్రబాబు నాలుగేళ్లుగా మోదీ సంకలోనే కొనసాగిన సంగతి మరిచాడంటూ ఎద్దేవా చేశారు. మోదీ సహకారంతోనే తెలంగాణ ఏడు మండలాలు ఎత్తుకేళ్లి, హైకోర్టుకు చంద్రబాబు అడ్డం పడుతున్నాడని విమర్శించారు. చావునోటి దాకా వెళ్లి తాను సాధించిన తెలంగాణను మహాకూటమి పేరుతో చంద్రబాబు నాశనం చేసేందుకు చూస్తుంటే చూస్తు ఊరుకునేది లేదని స్పష్టం చేసారు.

ఇక్కడ దుకాణం తెరిస్తే తెలంగాణ దెబ్బకు ఇప్పటికే అమరావతి కరకట్టపై పడిన చంద్రబాబు తాను మూడోకన్ను తెరిచానంటే ఆగమవ్వక తప్పదంటూ కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేసేందుకు కాళేశ్వరం, సీతారామా, పాలమూరు-డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు రీడిజైన్లతో నిర్మాణాలు చేపడితే అడుగడుగునా కాంగ్రెస్ నాయకులు అడ్డు పడి ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై 196కేసులు వేశారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని పర్యావరణ అనుమతులు సాధించే సదరు మంత్రిత్వ శాఖ అనుమతులెట్లా ఇచ్చిందంటు కేసులు వేసిన దుర్మార్గులు కాంగ్రెసోళ్లంటు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో ఒక్క పవర్ ఫ్లాంట్ నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు నల్లగొండ జిల్లాలో దామరచర్లలో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థల్ పవర్ ఫ్లాంట్ తెస్తే దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ ద్వజమెత్తారు. అన్నారు.