దిగ్బ్రాంతి కలిగిస్తున్న ఆదిత్యనాథ్ పాలన! 

23 కోట్ల జనాభాతో ఉన్న ఉత్తర ప్రదేశ్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడి ఉంటె, ప్రపంచంలో చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియాల ర్వాత ఇదో పెద్ద దేశంగా ఉండెడిది. కానీ అభివృద్ధిలో, పాలనలో, శాంతిభద్రతలలో దేశంలో అధోగమనంలో ఉండెడిది. 

ఆ రాష్ట్రానికి ముఖ్యమంతిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఎటువంటి పరిపాలన అనుభవం లేని ఒక సాధువు ఇంత పెద్ద రాష్త్రానికి ముఖ్యమంత్రి ఏమిటని అందరు పెదవి విరిచారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా మూడేళ్ళ పదవీ కాలాన్ని గత నెలలో  పూర్తిచేసుకోవడాన్ని కరోనా లాక్ డౌన్ తో దేశ ప్రజలు గమనించలేదు. 

మూడేళ్లపాటు అధికారమలో ఉన్న తొలి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ మూడేళ్ల కాలంలో ఆ రాష్ట్రం స్వరూపాన్నే మార్చివేశారు. ఇండియా టుడే అభిప్రాయం సేకరణలో వరుసగా గత రెండేళ్లుగా దేశములో  `ఉత్తమ ముఖ్యమంత్రి'గా వస్తున్నారు. బలమైన నాయకత్వాన్ని, సమర్ధమైన పరిపాలనను అందించడంతో పాటు ఉత్తర ప్రదేశ్ కు ఆధునిక అభివృద్ధి దిశను కల్పిస్తున్నారు. 

మాఫియాలు రాజమేలుతున్న రాష్ట్రంలో వారుంటే జైలులో ఉండాలి లేదా ఎన్కౌంటర్ లో చనిపోవాల్సిందే అని స్పష్టం చేసి వారిని కట్టడి చేశారు. మొదటి ఏడాదికే భయపడి కొందరు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతే, మరికొందరు దారిలోకి వచ్చారు. 

అప్పటివరకు మాఫియాకు భయపడి ఉండే పోలీసులు మొదటిసారిగా శాంతిభద్రతలను కాపాడటంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 1.70 లక్షల మంది పోలీసులను నీయమించి, బడ్జెట్ లో వారికి మంచి నిధులు కేటాయించి, పోలీస్ వ్యవస్థ స్వరూపాన్నే మార్చివేశారు. 

ఇక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి, పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. కొత్తగా మూడు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో రెండే విమానాశ్రయాలు ఉండగా కొత్తగా 12 నిర్మాణం చేపట్టారు. కేవలం లక్నోలో మాత్రమే ఉన్న మెట్రోను విస్తరింప చేస్తూ, కొత్తగా ఆరు రాష్ట్రాలలో మెట్రో పనులు చేపట్టారు. 

ఇక అప్పటి వరకు ఎవ్వరు విద్యుత్ బిల్లులు కట్టేవారు కాదు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కేంద్ర నిధులను ఉపయోగించుకొని అన్ని గ్రామాలకు, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాతో పాటు విద్యుత్ నాణ్యతను సహితం మెరుగు పరచి, విద్యుత్ పంపిణీలో సంస్కరణలు తీసుకొచ్చారు. రోజుగు 4 గంటలే విద్యుత్ సరఫరా స్థాయి నుండి బ్లాక్ స్థాయిలో 24 గంటలు, గ్రామ స్థాయిలో 18 గంటల సరఫరాకు చేసుకొంది. 

వ్యవసాయానికి సహితం తగు ప్రాధాన్యత ఇస్తూ 2010 నుండి పేరుకు పోయిన చెరకు రైతుల బకాయిలను చెల్లించడం కోసం గత మూడేళ్ళలో రూ 90,000 కోట్లకు పైగా కేటాయించారు. జిల్లాలవారి పంటల కేంద్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. నేరుగా నగదు బదిలీ ద్వారా సంక్షేమ పధకాలు చేపట్టారు. 

సగటు ఆదాయాన్ని గణనీయంగా పెంచి అభివృద్ధిలో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లారు. నేడు పెట్టుబడిదారులు మొదటిసారిగా ఆ రాష్ట్రం వైపు చూసే పరిస్థితులు కల్పించారు.