కరొనపై డబ్ల్యూహెచ్‌వోను పట్టించుకోని  భారత్

కరొనపై ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉనికిని కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ ప్రాణాంతక వైరస్ ను కప్పి పుచ్చడంతో చైనాతో చేతులు కలిపినట్లు డబ్ల్యూహెచ్‌వో పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న సమయంలో భారత్ మొదటి నుండి కరోనా విషయంలో ఈ సంస్థను లెక్క చేయడం లేదని తెలుస్తున్నది. 

కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్‌వో ఎప్పటికప్పుడు జారీచేస్తున్న సలహాలను పట్టించుకోకుండా భారత్ ప్రభుత్వం భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) సూచనలతో పాటు, క్షేత్ర స్థాయిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. 

వాస్తవానికి సుదీర్ఘకాలంగా డబ్ల్యూహెచ్‌వో భారత దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అనేక అంశాలపై సన్నిహితంగా పనిచేస్తున్నది. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు, టిబి, ఇతర వ్యాధుల విషయంలో శిక్షణ, సామర్ధ్యం పెంపొందించడంలో సహకరిస్తుంది. అయితే కరోనా విషయంలో మాత్రం ఈ సంస్థ సలహాలకు భారత్ విలువ ఇవ్వడం లేదు.

అందరు మాస్క్ లు వేసుకొనవసరం లేదని, కేవలం కరోనా రోగ లక్షణాలు ఉన్నవారు, ఆరోగ్య కార్యకర్తలు లేదా రోగులకు సంరక్షకులు మాత్రమే వెలుసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో గత వారం సూచించింది. కానీ భారత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖా మాత్రం ఇంటి నుండి బైటకు వస్తున్న వారందరూ ధరింప వలసిందే అనే స్పష్టం చేస్తున్నది. 

చైనాలో ఈ వైరస్ ప్రారంభమైన్నట్లు స్పష్టం కాగానే సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో చైనాకు ప్రయాణాలపై ఆంక్షలు పెట్టనవసరం లేదని జనవరి 30 న డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కాని అంతకు ఐదు రోజుల ముందే అత్యవసరం కానీ ప్రయాణాలు చైనాకు వద్దని భారత్ సూచించింది.  డబ్ల్యూహెచ్‌వో ప్రకటన తర్వాత మొత్తంగా చైనాకు ప్రయాణాలను రద్దు చేసింది. 

`పరీక్ష, పరీక్ష, పరీక్ష' ద్వారా మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయగలమని చెబుతూ దాదాపు ప్రజలు అందరికి కరోనా పరీక్షలు జరపాలని మార్చ్ 16న డబ్ల్యూహెచ్‌వో న సూచించింది. అయితే విచక్షణ రహితంగా పరీక్షలు జరిపి, ఇసోలాటిన్ వార్డ్ లకు పంపానవసరం లేదని ప్రకటించడం ద్వారా ఐసిఎంఆర్ అధిపతి బలరాం భార్గవ్ బహిరంగంగా డబ్ల్యూహెచ్‌వో సూచనను ధిక్కరించారు.

లాక్ డౌన్ ల ద్వారా వైరస్ ను కట్టడి చేయలేమని సహితం డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కానీ భారత్ ఐసిఎంఆర్ సూచన ఆధారంగానే మూడు వారాల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించింది. కేవలం విదేశాల నుండి వచ్చిన వారికి, వారిని కలిసిన వారికి, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే పరీక్షలను పరిమితం చేస్తున్నది. దేశంలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 5,000 దాటిన తర్వాత కూడా ఈ అంశంలో భారత్ వైఖరిలో చెప్పుకోదగిన మార్పు లేదు. 

కోవిడ్ 19 కట్టడికి సిఫార్స్ చేయడానికి నిర్దుష్టమైన ఆధారం గల ఔషధం లేకపోయినప్పటికీ ఐసిఎంఆర్ సిఫార్స్ పై భారత్ కొన్ని ఔషధాలను ఉపయోగిస్తుంది.  మొదట్లో ప్రాధమిక పరీక్షలలో ఉన్న రెండు ఔషధాలు - లోపినవీర్, రితోనవిర్ లను కూడా ఉపయోగించమని సిఫార్స్ చేసింది. తర్వాత వీటి స్థానంలో  మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ తో కలిపి యాంటీబయోటిక్ అజిత్రోమైసిన్ ను వాడుతున్నారు.