దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి  కోలుకొంటుంది  

అంతర్జాతీయ మందగమనం, దేశీయ లాక్‌డౌన్‌.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇప్పుడున్న విపత్కర పరిస్థితులు చక్కబడితే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

ఆర్బీఐ తమ ద్రవ్య విధాన నివేదికను విడుదల చేస్తూ కరోనా వైరస్‌ నేపథ్యంలో తాము తీసుకుంటున్న ద్రవ్యపరమైన నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థికపరమైన చర్యలు సత్ఫలితాలను ఇవ్వగలవన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఈ కష్టకాలంలో దేశ వృద్ధిరేటును అంచనా వేయలేమన్న ఆర్బీఐ రబీ సీజన్‌లో అధిక దిగుబడులు గ్రామీణుల కొనుగోళ్ల శక్తిని పెంచగలదని చెప్పింది. 

మరోవంక, కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నదని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీవో) హెచ్చరిక జారీ చేసింది. మునుపెన్నడు లేని  సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొక తప్పదని తెలిపింది. ఈ ఏడాది అంతర్జాతీయ వాణిజ్యం 13 శాతం నుంచి 32 శాతం వరకు పడిపోవచ్చునని వెల్లడించింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. 

మరోవంక కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై ఎందరో నిపుణులు వేస్తున్న అంచనాలను టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా తోసిపుచ్చారు.  మానవ ప్రేరణ, ధృఢ సంకల్పం గురించి వీళ్లందరికీ తెలియదని మాత్రం నాకు అర్థమవుతున్నదని అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ పని అయిపోయిందన్నారు. అయి తే ఆ దేశం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తాను చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు.  మనం తప్పక ఈ మహమ్మారిని తరిమి కొడు తాం. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదు అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని భరోసా వ్యక్తం చేశారు.