కొవిడ్ 19 కు కేంద్రం ఎమర్జెన్సీ ప్యాకేజ్ 

కరోనా వైరస్ మహమ్మారిని  ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కొవిడ్ 19 ఎమర్జెన్సీ ప్యాకేజీని ప్రకటించింది.

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ. 15 వేల కోట్ల నిధులను భారత ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 

జాతీయ, రాష్ట్రాల స్థాయిలో అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్హ్చుకోవడం, పర్యవేక్షణను మెరుగు పరచడం కోసం, ల్యాబ్ లను ఏర్పాటు చేయడంతో పాటు బయోసెక్యూరిటీ సంసిద్ధత కోసం ఈ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. 

ఈ ఏడాది జనవరి నుంచి 2024 మార్చి వరకూ మూడు దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌ వందన గుర్నానీ వెల్లడించారు.  దీని అమలుకోసం 100 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుంది. 

ఈ మేరకు వివరాలను పొందుపరుస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశలో వచ్చే జూన్ నాటికి నేషనల్ హెల్త్ మిషన్ కింద నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. 

ఈ దశలో  కొవిడ్ 19 ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు, వెంటిలేటర్లు, ల్యాబ్ ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వలంటీర్లకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించింది. కొన్నిల్యాబ్ లను గుర్తించి, వాటిలో డయాగ్నస్టిక్ సామర్థ్యం పెంపు, నమూనాల రవాణాకు సంచార మద్దతు అందిస్తామని చెప్పింది.

ఈ ప్యాకేజ్ లో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్స్ (పీపీఈ)లు, ఎన్ 95 మాస్కులు, వెంటిలేటర్లను కేంద్రమే అందిస్తుందని తెలిపింది. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాపయోగాలు,  అంబులెన్స్ లలో డిస్ ఇన్ఫెక్టెంట్లు స్ప్రే చేస్తామని చెప్పింది. 

ఈ ఏడాది జూన్ వరకు ఫేజ్ 1, జులై నుంచి 2021 మార్చి వరకు ఫేజ్ 2, ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024 వరకు ఫేజ్ 3 అమలు చేస్తామని వివరించింది. 

ఇలా ఉండగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో 549 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 166 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 

నిన్న ఒక్కరోజే 17 మంది చనిపోయారు. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5734కు చేరిందని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ బారి నుంచి 473 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

పీపీఈ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లను ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే 20 మ్యానుఫ్యాక్చర్స్‌ కంపెనీలు పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయని అగర్వాల్‌ తెలిపారు. 1.7 కోట్ల పీపీఈ కిట్లకు, 49 వేల వెంటిలేటర్లకు ఆర్డర్స్‌ ఇచ్చామని వెల్లడించారు. 

రైల్వే విభాగంలో 2,500 మంది డాక్టర్లు, 35 వేల పారామెడికల్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భారతీయ రైల్వేలలో 80 వేల ఐసోలేషన్‌ బెడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటి కోసం 5 వేల కోచ్‌లను ఉపయోగించారు. 

తెలంగాణతో పాటు 9 రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలను కేటాయించింది. కరోనాపై రాష్ట్ర అధికారులతో కలిసి కేంద్ర బృందాలు పని చేయనున్నాయి. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌కు ప్రత్యేక బృందాలను కేటాయించారు.