సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది

కరోనాపై పోరాటానికి మానవతా దృక్పథంతో భారత్‌ చేయగలిగిన సాయమంతా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే యాంటి మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ కావాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను అడిగిన విషయం తెలిసిందే. 

అమెరికా కోరిక మేరకు భారత్‌ క్లోరోక్విన్‌ మాత్రలను ఆ దేశానికి సరఫరా చేసింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ... అసాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరమని పేర్కొన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై నిర్ణయం తీసుకున్న భారత్‌కు, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. 

దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయని చెప్పారు. భారత్‌-అమెరికా సంబంధాలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

కోవిడ్‌పై పోరాటానికి భారత్‌ చేయగలినంతా చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కలికికట్టుగా ఎదుర్కొంటూ విజయం సాధిద్దామని  ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇలా ఉండగా, భారత్‌లో ఇప్పటి వరకు కరోనా వైరస్ 6041 మందికి సోకగా 184 మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా రెండో దశ నుంచి మూడో దశకు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య 1135కు చేరుకున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ 453 మందికి సోకగా 11 మంది చనిపోయారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.