ఏపీ త‌బ్లిగీల‌పై యూపీలో కేసు 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన 10 మంది తబ్లిగీల‌పై ఉత్తర ప్రదేశ్ పోలుసులు అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు న‌మోదు చేశారు. 

ఏపీకి చెందిన ఈ 10 మంది గ‌త నెల ఢిల్లీ మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జమాత్ నిర్వ‌హించిన మ‌త స‌మ్మేళ‌నానికి హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత ఏపీకి వెళ్ల‌కుండా యూపీకి వెళ్లారు. అక్క‌డే మ‌రో త‌బ్లిగీ స‌భ్యుడి ద‌గ్గ‌ర త‌ల‌దాచుకున్నారు. 

బావార్చీలోని శాంగిబెగ్ ప్రాంతానికి చెందిన 50 ఏండ్ల‌ వ్యక్తి వీరికి ఆశ్రయం ఇచ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అత‌డికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. 

అత‌డిపైన‌, అత‌డి ద‌గ్గ‌ర ఆశ్ర‌యం పొందిన 10 ఏపీ వాసుల‌పైనా కేసులు న‌మోదు చేశారు. వారి నుంచి నమూనాలు సేకరించి క‌రోనా పరీక్షల కోసం పంపించారు.   

కాగా, ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన 15 జిల్లాలను ఈ నెల 30 వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ జిల్లాల్లోని ప్రజలెవరూ నిత్యవసరాల కోసం కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అన్ని వస్తువులు ఇళ్లవద్దకే డోర్‌డెలివరీ చేయనున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. మూసివేయనున్న జిల్లాల జాబితాలో లక్నో, నోయిడా, ఘజియాబాద్, సీతాపూర్, కాన్పూర్, ఆగ్రా, ఫిరోజాబాద్, బరేలీ, షమ్లీ, షహారన్పూర్, బులంద్‌షహర్, వారణాసి, మహారాజ్‌గంజ్, బస్తి తదితర జిల్లాలు ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాలకు గానూ ఇప్పటి వరకు 37 జిల్లాల్లో 326 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కరోనా కేసులు నమోదైన 15 జిల్లాలను కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు.