రాష్ట్రాలకు జీఎస్టీ, పెండింగ్ నిధులు 

కరోనా వైరస్ కారణంగా నిధుల లేమితో అల్లాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

అక్టోబరు, నవంబరు నెలలకు గాను నిన్న రూ.14,103 కోట్లను కేంద్రం విడుదల చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందే తొలి విడత నిధులు రూ. 19,950 కోట్లను విడుదల చేసింది. అంటే మొత్తంగా రూ. 34,053 కోట్లను విడుదల చేసింది. 

డిసెంబరు, జనవరి నెలల నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం. మరోవైపు, జీఎస్టీ వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. 

అంతకుముందు వరుసగా నాలుగు నెలలపాటు లక్ష కోట్లకుపైనే జీఎస్టీ వసూలైంది. అయితే, మార్చిలో ఇది రూ.97,597 కోట్లకు పడిపోయింది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటకపోవడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి.

కాగా, కరోనా నేపథ్యంలో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. పెండింగ్‌లో ఉన్న రూ.5 లక్ష ల వరకు ఆదాయం పన్ను రీఫండ్‌లను తక్షణమే విడుదల చేయనున్నట్టు ఐటి శాఖ ప్రకటించింది. వ్యక్తిగత, వ్యాపార సంస్థలకు తక్షణమే పెండింగ్ రీఫండ్‌లను అందివ్వాలని ఐటి నిర్ణయించింది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఆదాయపు పన్ను రీఫండ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని జిఎస్‌టి, కస్టమ్ రీఫండ్‌లను కూడా విడుదల చేస్తామని ఐటి శాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది. మొత్తం రూ.18 వేల కోట్ల రీఫండ్‌ను ప్రభుత్వం జారీ చేయనుందని, దీంతో లక్ష మంది వ్యాపారవేత్తలకు ప్రయోజనం ఉంటుందని సమాచారం.