ఉచితంగా కరోనా పరిక్షలు.. సుప్రీం ఆదేశం 

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో సుప్రీంకోర్టు  కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్-19 సోకినట్లు నిర్థరించేందుకు నిర్వహించే అన్ని పరీక్షలను ఉచితంగానే నిర్వహించాలని తెలిపింది. దీనికోసం అయ్యే ఖర్చులను భర్తీ చేసేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం గురించి పరిశీలించాలని సూచించింది. 

ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది శశాంతక్ దేవ్ సూధి ఈ పిల్ దాఖలు చేశారు. 

కోవిడ్-19 పరీక్షలు చాలా ఖరీదైనవిగా మారాయని, దేశంలోని ప్రజలందరికీ ఈ పరీక్షలను ఉచితంగానే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గుర్తించిన ప్రైవేటు ల్యాబొరేటరీలలో కోవిడ్-19 నిర్థరణ పరీక్షలను ఉచితంగానే నిర్వహించాలని తెలిపింది. 

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ 118 ల్యాబొరేటరీలు రోజుకు 15,000 పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో పని చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా 47 ప్రైవేటు ల్యాబొరేటరీలను కూడా ఈ పరీక్షల కోసం రంగంలోకి దించినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ప్రైవేటు ల్యాబొరేటరీలు పరీక్షల కోసం భారీ సొమ్మును వసూలు చేయకుండా జాగ్రత్తవహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షల కోసం అయ్యే ఖర్చును భర్తీ చేసేందుకు తగిన సమగ్ర యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

కాగా, ‘ప్రస్తుత సంక్షుభిత తరుణంలో డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే మన పోరాటయోధులు. వారిని ఎలాగైనా కాపాడుకోవాలి’ అని కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టంచేసింది. కరోనా చికిత్సలో నిమగ్నమైన సిబ్బందికి తగు సంఖ్యలో వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈలు) ఉండేలా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.