మే 15 వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాల మూసివేత 

మే నెల 15 వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను మూసివేయాలని కేంద్ర మంత్రుల బృందం ప్రభుత్వానికి సూచించింది. 21 రోజుల లాక్‌డౌన్ పొడిగించినా, ఎత్తేసినా... దాంతో సంబంధం లేకుండా వీటి మూసివేత కొనసాగించాలని సిఫారసు చేసింది.

ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తున్నది. హోంమంత్రి అమిత్ షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మరో నాలుగు వారాల పాటు ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలను పునఃప్రారంభించరాదని మంత్రుల బృందం సూచించింది.

కాగా మే రెండో వారం తర్వాత దాదాపు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ వేసవి సెలవులు ఉన్నందున జూన్ నెలాఖరు వరకు వీటిని మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రుల బృందం చేసిన సిఫారసులకు ప్రాధాన్యం ఏర్పడింది.