నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయాలి  

దేశంలో అష్ట దిగ్బంధనం అమలవుతున్న సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955 నిబంధనలను అమలు చేయాలని తెలిపారు. 

ఈ చట్టం ప్రకారం నేరాలు క్రిమినల్ స్వభావం కల నేరాలని, నేరస్థులను గరిష్ఠంగా ఏడేళ్ళ జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండు శిక్షలతో శిక్షించవచ్చునని తెలిపారు. విశాల ప్రజానీకానికి న్యాయమైన ధరలకు నిత్యావసర వస్తువులు లభించేవిధంగా వ్యక్తిగతంగా అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.  

 బ్లాక్ మార్కెటింగ్ నిరోధం, నిత్యావసర వస్తువుల సరఫరా నిర్వహణ చట్టం, 1980 ప్రకారం నేరస్థులను అరెస్టు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. నిత్యావసర వస్తువుల నిల్వకు పరిమితులు విధించడం, ధరలపై పరిమితులు విధించడం, ఉత్పత్తిని పెంచడం, డీలర్ల ఖాతాలను తనిఖీ చేయడం వంటి చర్యలు అమలు చేయాలని సూచించింది. 

వేర్వేరు కారణాలతో ఉత్పత్తులకు నష్టం జరిగిందని తెలుస్తోందని, ఈ కారణాల్లో ముఖ్యమైనది కార్మికులు అందుబాటులో లేకపోవడమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో భారీగా నిత్యావసర వస్తువులను దాచిపెట్టి, బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, న్యాయమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అత్యవసర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

కాగా, అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నిత్యావసర వస్తువుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేసేవారిపై వేగంగా, కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.