లాక్‌డౌన్ పొడిగింపుకే ప్రధాని మోదీ సుముఖత 

ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ కొనసాగింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ధిష్టమైన ప్రకటన చేయక పోయినప్పటికీ బుధవారం ప్రతిపక్ష నాయకులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం పొడిగింపుకే విముఖంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.  ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే ఏకైక పరిష్కారమని పార్లమెంట్ లోని వివిధ పక్ష నాయకులతో మోదీ స్పష్ట చేసిన్నట్లు తెలుస్తుంది. 

‘‘ప్రజల ప్రాణ రక్షణకై లాక్‌డౌనే పరిష్కారం. నేను ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరూ అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతా. ఇప్పటి వరకైతే మొత్తానికి మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు" అని చెప్పారు. 

"జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. సామాజిక దూరం పాటించే విషయంలో మనం మరింత కఠినంగా ఉండాల్సిందే. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు’’ అని మోదీ సూచించారు. 

దేశంలో పరిస్థితి సామాజిక అత్యవసర పరిస్థితికి సమానంగా కనిపిస్తోందని, మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని, మరింత జాగరూకతతో వ్యవహారించాల్సి ఉందని అఖిలపక్ష నేతలో మోదీ పేర్కొన్నట్లు తెలుస్తున్నది. 

ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని, కరోనాకు ముందు పరిస్థితి, తర్వాత పరిస్థితి అన్నట్లుగా మారుతుందని ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 

కాగా, ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఆలోచిస్తున్నారని వీడియో కాన్ఫరెన్స్ అనంతరం టిడిపి పక్ష నేత గల్లా జయదేవ్ తెలిపారు. 11న సీఎంలతో ప్రధాని కాన్ఫరెన్స్ తర్వాత లాక్‌డౌన్‌పై స్పష్టత వస్తుందని చెబుతూ లాక్‌డౌన్ పొడిగిస్తే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోందని పేర్కొన్నారు.