ట్రంప్ భారత్ ను హెచ్చరించారంటూ వక్రభాష్యం 

మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని సడలించి అమెరికాకు సరఫరా చేయక పోతే ప్రతీకార చర్యలు ఉండగలవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హెచ్చరించారు. 

వెంటనే కొద్దీ గంటలలో ఎగుమతులపై నిషేధాన్ని భారత్ సడలించింది. అమెరికాతో పాటు మొత్తం 30 దేశాలకు ఎగుమతులు చేయడానికి ఒప్పుకొంది... ఈ విధంగా మంగళవారం భారత మీడియాలో ప్రముఖంగా  వార్తలు వచ్చాయి. 

అయితే భారత్ ను ట్రంప్ హెచ్చరించారని అంటూ అమెరికా మీడియాలో గాని, అంతర్జాతీయ మీడియాలో గాని ఎటువంటి కధనాలు రాలేదు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశాన్ని పూర్తిగా పరిశీలించిన వారికి ఇదంతా అభూత కల్పన అని స్పష్టం అవుతుంది. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానాన్ని వక్రీకరించి వైనం స్పష్టం అవుతుంది. 

ఒక మీడియా ప్రతినిధి భారత్ నిషేధం ఎత్తివేయని పక్షంలో ప్రతీకార చర్యలు ఉంటాయా అని అడిగితే "అట్లా ఎందుకు జరుగుతుంది? నేను ప్రధాని మోదీతో మాట్లాడాను" అంటూ ట్రంప్ స్పష్టంగా చెప్పారు. పైగా, మీడియా సమావేశంలో పలు సందర్భాలలో అమెరికాకు భారత్ చాలాముఖ్యమైన భాగస్వామి అంటూ, భారత్ వాటిని సరఫరా చేస్తుందని ఆశిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. 

అయితే చివరిలో అమెరికా  వైద్య పరికరాల ఎగుమతులను నిషేధించినందుకు ప్రతీకారంగా భారత్ ఈ మందులను నిషేధించిందా అని అడిగితే "ఎందుకు కాకూడదు" అంటూ యధాలాపంగా ట్రంప్ అన్నారు. అయితే వెంటనే భారత్ అమెరికాకు మాత్రమే నిషేధింపలేదని, అనేక దేశాలకు కూడా నిషేధించిందని చెప్పడం గమనార్హం. 

పైగా, ఇదంతా ఒక మీడియా వ్యక్తికి, ట్రంప్ కు మధ్య జరిగిన సంభాషణ మాత్రమే. ట్రంప్ ప్రకటన కానేకాదు. భారత్ ప్రతీకారాన్ని దిగే అవకాశం గురించి ట్రంప్ ప్రస్తావించారు గాని, ఆయన ఎక్కడ భారత్ కు హెచ్చరిక చేయలేదు. పైగా తన కోర్కెను మోదీ మన్నిస్తారని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.