కేంద్రం నుండి మరో భారీ ఆర్ధిక ప్యాకేజీ

కోవిడ్-19 కల్లోలం కారణంగా కకావికలమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్ధిక ప్యాకేజీతో ముందుకు రానున్నట్టుతెలుస్తున్నది. ప్రత్యేకించి డిమాండ్- సరఫరా సమస్యలను సమర్థంగా ఎదుర్కునేలా దీన్ని రూపొందిస్తున్నట్టు ఆర్ధిక శాఖ వర్గాలు వెల్లడించాయి. 

దీన్ని ఏ రూపంలో, ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నాయి. అయితే గతంలో పేదల కోసం వివిధ పథకాలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించిన రూ. 1.70 లక్షల కోట్ల  ప్యాకేజీకంటే... రాబోయే ఆర్థిక ప్యాకేజీ మరింత పెద్దగా ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.

‘‘ఆర్థిక శాఖలోని పలు విభాగాలతో కేంద్రం నిత్యం చర్చలు జరుపుతోంది. ఈ విపత్కర సమయంలో ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తీసుకుంటోంది. లాక్‌డౌన్ పరిస్థితిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత దీనిపై ఓ పటిష్ట ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది..’’ అని అధికారులు తెలిపారు. 

ఈసారి ఆర్థిక ప్యాకేజీలో ప్రత్యేకించి దేశంలోని పారిశ్రామిక సంస్థలు,  చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రం దృష్టిపెడుతుందని చెబుతున్నారు. దీంతోపాటు లాక్‌డౌన్ కారణంగా కుదేలైన రవాణా, విమానయాన రంగాలకు ఊరట కల్పించనున్నట్టు తెలుస్తున్నది. 

పన్ను చెల్లింపుదారులకు మినహాయింపులతో పాటు ప్రధాన వినియోగ వస్తువులపై సుంకాల నుంచి ఉపశమనం ప్రకటించవచ్చునని తెలుస్తోంది. వీటితో పాటు మూలధన మార్కెట్‌ను బలోపేతం చేసే అంశానికి కూడా రాబోయే ఆర్ధిక ప్యాకేజీలో చోటుకల్పించే అవకాశం ఉంది.