సంక్షోభంలో హనుమంతుడి జీవితమే స్ఫూర్తి

మానవులు ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హనుమంతుడి జీవితమే స్ఫూర్తినిస్తుందని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రధాని త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో ఓ పోస్ట్ చేశారు.  

దేశ ప్రజలకు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న‌ద‌ని, దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించడంతో దేశ‌ ఆర్థిక స్థితిగతులు తారుమారు అవుతున్నాయని  ఈ సందర్భంగా ప్ర‌ధాని ట్వీట్ గుర్తు చేశారు. 

భక్తిభావం, బలం, అకింతభావం, క్రమశిక్షణకు వాయుపుత్రుని జీవితం నిదర్శనమ‌ని, ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయన జీవితం స్ఫూర్తినిస్తుందని ప్ర‌ధాని హితవు చెప్పారు. 

 ప్రతి ఏడాది చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హిందువులు హనుమాన్‌ జయంతిని జరుపుకొంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి.  

కాగా, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రధానమంత్రి మోదీని హనుమంతుడితో పోల్చారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోన్న తరుణంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను అందిస్తున్న మహనీయుడని కొనియాడారు. నాడు లక్ష్మణుడిని హనుమంతుడు సంజీవని ద్వారా కాపాడినట్లే నేడు మానవాళిని మోదీ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌తో కాపాడుతున్నారని ప్రశంసించారు.