గుంటూరు లో పూర్తిగా లాక్‌డౌన్‌‌

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గుంటూరు నగరంలో మంగళవారం ఒక్కరోజే 8 కొత్త కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు నగరంలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు.

బుధవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు, కూరగాయల కొనుక్కునేందుకు అనుమతినివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెడ్‌జోన్‌లో ఆంక్షలు కట్టుదిట్టం చేస్తామని, రెడ్‌జోన్‌కి అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. 

గుంటూరు నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా కూరగాయలు కూడా నాలుగు రోజులకు ఒకసారి కొనుక్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరుకు కేవలం మూడు రహదారులు మాత్రమే ఉంటాయని చెప్పారు.  గుంటూరు జిల్లాలో తాజా కేసులతో కలిపి మొత్తం 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.