సెలవుల్లో భారత్ లోనే... భారత్ వస్తువులే కొనండి 

కరోనా కారణంగా భారత ప్రధాని 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థకు ఏర్పడిన నష్టాలను భర్తీ చేయడం కోసం భారతీయులు అందరూ సెలవులలో భారత్ దేశంలోనే గడపాలని, భారత్ లో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ పిలుపిచ్చారు. 

లాక్‌డౌన్‌ వలన అనేక రంగాలకి చెందిన పరిశ్రమలు మూతపడ్డాయి. రోజువారి వేతనం పొందే కార్మికులతో పాటు వాటిని నడుపుతున్న సంస్థలు కూడా నష్టాలలో ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న కాజల్‌ దేశ ప్రజలకి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పలు సూచనలు చేశారు.

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత స్థానిక వ్యాపారులకు, వ్యాపార సంస్థలకు ప్రజలంతా మద్దతు తెలపాలని  ఆమె కోరారు. ''లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మన దేశానికి మంచి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మీ సెలవులన్ని భారత్ లోనే గడపండి" అని కాజల్ కోరారు. 

బయట తినేవాళ్లు స్థానిక రెస్టారెంట్‌ హోటల్స్‌ లో తినాలని, భారత్ లో పండించిన కూరగాయల్ని, పండ్లను కొనాలని ఆమె సూచించారు. భారతీయ బ్రాండ్ల షూస్‌, వస్త్రాలను కొని భారత్‌ వ్యాపారులకు సహాయ పడమని ఆమె అభ్యర్ధించారు. 

కరోనా వలన బాగా దెబ్బ తిన్న భారత ఆర్ధిక వ్యవస్థ మన సాయం లేకుండా కోలుకోవడం చాలా కష్టమని ఆమె దేశ ప్రజలకు హితవు చెప్పారు. కరోనా తర్వాత కూడా మనం ఒకరికొకరం సాయంగా ఉంటూ ముందుకు సాగుదామని ఈ కలువ కళ్ల సుందరి చెప్పుకొచ్చారు.