బత్తాయి, నిమ్మ రైతులకు ఆదుకోండి కేసీఆర్  

కరోనా మహమ్మరిపై యుద్ధం కోసం దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్నందున తీవ్ర నష్టాలకు గురవుతున్న తెలంగాణలో వాణిజ్య పంటలైన బత్తాయి, నిమ్మ రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

ప్రతి ఏడాది రాష్ట్రంలో బత్తాయి , నిమ్మ సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడి తీసేవారని, ఈ ఏడాది కిడా ఆరుగాలం కష్ట పడి పండించిన పంట చేతికచ్చే సమయానికి లాక్ డౌన్ రావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పండిన పంట ప్రతి ఏడాది మహారాష్ట్ర లోని నాగపూర్ మార్కెట్ కు వెళ్ళేదని చెప్పారు. 

దక్షిణాది రాష్ట్రాల్లో పండే బత్తాయి, నిమ్మకు ఉన్న ఏకైక మార్కెట్ నాగపూర్ కావడం, అక్కడ రైతులకు గిట్టుబాటు ధర పలకడం గత కొద్ది సంవత్సరాలుగా అక్కడే అమ్మకాలు చేస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పుడు ఉన్న పరిస్ధితుల్లో అక్కడికి రవాణా చేయడం రైతులకు కష్టంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 

సీఎం కేసీఆర్ గత వారం మీడియా సమావేశంలో కరోనా వైరస్ ను తట్టుకోవడానికి ప్రజలు సి విటమిన్ ఫుడ్ తీసుకోవాలని, అందులో బత్తాయి పండ్లు తినాలి అనడంతో రైతుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని సంజయ్ చెప్పారు. తాము పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. 

కాబట్టి ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సివిల్ సప్లై శాఖ ద్వారా పేద ప్రజలకు అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనితో ప్రజలకు ఆరోగ్యం , రైతులకు న్యాయం చేసిన వారువుతారని సూచించారు. నాగపూర్ బత్తాయి మార్కెట్ లో ఏ ఏడాది ఉన్న గిట్టుబాటు ధర ను ప్రభుత్వం నిర్ణయించని చెబుతూ, ఆ ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ వరి పంట సమృద్ధిగా పండినా పంట కోతకు వచ్చే సమయానికి కరోనా దెబ్బ పడటంతో రైతులు ఆందోళనలో ఉన్నారని సంజయ్ తెలిపారు. నిన్నటి మీడియా సమావేశంలో గన్ని బ్యాగుల కొరతను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే రైతులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలు అనేకం ఉన్నాయని వాటిని వెంటనే తీర్చాలని బండి సంజయ్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఒకవైపు అకాల వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న తరుణంలో రైతులకు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు టోకెన్స్ జారీ చేసి కూలీల కొరత దృష్ట్యా వరి కొత మిషన్స్ ( ఆర్వెస్టర్లను ) గ్రామాల్లోకి అనుమతించాలని సూచించారు. 

త్వరితగతిన ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని , మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. కరొనపై పోరాటంలో రైతులను ఆదుకోవడంలో పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని బీజేపీసంజయ్ చెప్పారు.