జపాన్ లో ఎమర్జెన్సీ ప్రకటన 

కరోనా వైరస్ ఉదృతిని అడ్డుకునేందుకు జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో అత్యవతర పరిస్థితిని (ఎమర్జెన్సీ) అమలు చేయబోతున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబే ప్రకటించారు. ఈరోజు నుంచే ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

అయితే టోక్యో, కనగవ, సైతామా, చిబా, ఒసాకా, హ్యోగో, ఫుకోక ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు పాక్షికంగా కొనసాగుతయని స్పష్టం చేశారు. సూపర్ మార్కెట్లు, ప్రజా రవాణా నడుస్తాయని,  అయితే ప్రజలు ఇళ్లలోనే ఉంటూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని షింజో అబే తెలిపారు. 

'మనలో కనీసం 70 నుండి 80 శాతం వరకు భౌతిక దూరాన్ని పాటించినా రెండు వారాలలో ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయవచ్చని, ఆంక్షలను సడలింప వచ్చని నిపుణులు చెబుతున్నారు' అని ఆయన ప్రకటించారు. పరిస్థితువులు మెరుగు పడుతున్న కొలది సడలింపు ఉంటుందని చెప్పారు. 

ఇప్ప‌టికే మాల్స్‌, సినిమా థియేట‌ర్లు, బార్లు, ప‌బ్బులు మూసివేశారు. కాగా బ్యాంకులు, సూప‌ర్ మార్కెట్‌లు ఓపెన్ చేసి ఉంటాయ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది. ఈ ఎమ‌ర్జెన్సీ నెల‌రోజుల పాటు ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.  

ఇప్ప‌టికి జ‌పాన్‌లో 4వేల‌కు కోవిడ్ కేసులు ఉండ‌గా 92 మంది మృతిచెందారు. 592 మంది రిక‌వ‌రీ కాగా 3,222 యాక్టివ్ కేసులున్నాయి. 79మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.  

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలకు లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో మొదట విధించిన కాల పరిమితి దాటిపోయినప్పటికీ మళ్లీ పొడగించాయి. 

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,58,469 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి 2,90,572 మంది కోలుకోగా 75,895 మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా 3,67,650 మంది కరోనా బారిన పడ్డారు. 16,523 మంది ఇటాలియన్లు కరోనా వల్ల మరణించారు.